Tuesday, January 7, 2025
HomeఆటIND vs AUS: ఇదీ పాయె.. ఐదో టెస్టులో చేతులెత్తేసిన టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైన‌ల్‌ ఆశలు...

IND vs AUS: ఇదీ పాయె.. ఐదో టెస్టులో చేతులెత్తేసిన టీమిండియా.. డబ్ల్యూటీసీ ఫైన‌ల్‌ ఆశలు ఫసక్..!

బోర్డర్ గావస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఈ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆసీస్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరిగింది. 3-1తో సిరీస్ ను ఆస్ట్రేలియా జట్టు సొంతం చేసుకుంది. చివరి టెస్టు శుక్రవారం ప్రారంభం కాగా.. మూడు రోజుల్లోనే పూర్తి అయ్యింది. రెండో ఇన్నింగ్సుల్లోనూ టీమిండియా దారుణంగా విఫలం అవడంతో.. ఆస్ట్రేలియా ఈజీ విక్టరీ సాధించింది. మూడోరోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ లో భారత్ జట్టు ఆసీస్ కు 162 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్ బ్యాటర్లు కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించారు.

- Advertisement -

సిడ్నీ టెస్టు మ్యాచ్ లో భారత్ జట్టు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 185 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తరువాత ఆస్ట్రేలియా జట్టు 181 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా.. రెండో రోజు (శనివారం) ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసింది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా ఆలౌట్ అయింది.

కమిన్స్ బౌలింగ్ లో జడేజా (13) పెవిలియన్ బాటపట్టగా.. ఆ వెంటనే వాషింగ్టన్ సుందర్ (12) కమిన్స్ బౌలింగ్ లోనే బౌల్డ్ అయ్యాడు. కొద్దిసేపటికే బొలాండ్ బౌలింగ్ లో సిరాజ్ (4) ఖవాజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. వెన్నునొప్పి కారణంగా రెండో ఆటలో మైదానాన్ని వీడిన జస్ర్పీత్ బుమ్రా బ్యాటింగ్ వచ్చినా వెంటనే డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో 157 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ ఒక్కడే 6 వికెట్లు పడగొట్టాడు. కమిన్స్ మూడు, వెబ్ స్టర్ ఒక వికెట్ తీశారు.

162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్లు దూకుడుగా ఆడారు. స్వల్ప లక్ష్యాన్ని 37 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సాధించారు. ఉస్మాన్ ఖావాజా 41 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. ట్రావిస్ హెడ్ (34), వెబ్ స్టర్ (39) పరుగులు చేసి అజేయంగా నిలిచి మ్యాచ్ ను ముగించారు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ ఒక్క వికెట్ సాధించాడు. కాగా సెకెండ్ ఇన్నింగ్స్ లో టీమిండియా స్టార్ ఆటగాడు బుమ్రా గాయం కారణంగా ఫీల్డింగ్ కు రాలేదు.

తాజా విజయంతో డబ్ల్యూటీసీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ కు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో జూన్ నెలలో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఇక ఇండియా ఆడిన లాస్ట్ ఎనిమిది టెస్టుల్లో కేవలం ఒక్క టెస్టులో మాత్రమే విజయం సాధించింది. ఆరు టెస్టుల్లో ఓడిపోయింది. ఒక టెస్టును మాత్రం డ్రా చేసుకుంది. ఇక ఈ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ను టీమిండియా బౌలర్ జస్ర్పీత్ బుమ్రా దక్కించుకోగా.. సిడ్నీ టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ను ఆస్ట్రేలియా బౌలర్ స్కాట్ బోలాండ్ దక్కించుకున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News