ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా సెమీ ఫైనల్‌లో టీమిండియాతో(IND vs AUS) జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కంగారుల జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది. షమీ బౌలింగ్‌లో కూపర్ ఔట్ అయ్యాడు. అయితే ఐసీసీ టోర్నీల్లో భారత జట్టుకు తలనొప్పిగా మారి ట్రావిస్ హెడ్ మాత్రం మరోసారి ఫోర్లు, సిక్సర్లతో రెచ్చిపోయాడు. కానీ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి హెడ్(39)ను బోల్తా కొట్టించాడు.
మరోవైపు కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాత్రం ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. లబుషేన్(29), ఇంగ్లీష్(11)లతో కలిసి మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అనంతరం 73 పరుగుల వద్ద షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక చివర్లో అలెక్స్ క్యారీ 61 పరుగులతో రాణించాడు. దీంతో 49.3 ఓవర్లలో 264 పరగులు చేయగలిగింది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు, రవీంద్ర జడేజా 2 వికెట్లు, హార్దిక్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ఆస్ట్రేలియాపై 2023 వరల్డ్ కప్ ఫైనల్ ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. మరోవైపు ఆసీస్ కూడా భారత్‌ను ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టాలని భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా జరగనుంది.