Surya Kumar Yadav: టీమిండియా టీ20 జట్టు కెప్టెన్, విధ్వంసకర బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ పై సందేహాలు తలెత్తాయి. ఇలాంటి సమయంలోనే తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో 150 సిక్సర్లు బాదిన రెండో భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాతో బుధవారం కాన్‌బెర్రాలోని మనుకా ఓవల్ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో సూర్య ఈ రికార్డుని సాధించాడు. అయితే, ఈ జాబితాలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. టీ20 ఫార్మాట్లలో 205 సిక్సర్లు బాదాడు.
Read Also: IND vs AUS: స్కై సూపర్ సిక్సర్.. టీ20ల్లో 150వ సిక్స్ కొట్టిన విధ్వంసకర బ్యాటర్
రెండో సిక్సర్ తో అరుదైన రికార్డు
ఇకపోతే, ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో తన రెండో సిక్సర్ బాదిన వెంటనే సూర్యకుమార్ 150 సిక్సర్ల క్లబ్‌లో చేరాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీట్ సాధించిన ఐదో బ్యాటర్ అతడే కావడం గమనార్హం. కేవలం 86 ఇన్నింగ్స్‌ల్లోనే సూర్య ఈ మైలురాయిని చేరుకొని, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. యూఏఈకి చెందిన మహమ్మద్ వసీం (66 ఇన్నింగ్స్‌లు) మాత్రమే అతని కంటే ముందున్నాడు. న్యూజిలాండ్ మాజీ ఆటగాడు మార్టిన్ గప్టిల్ (101 ఇన్నింగ్స్‌లు) మూడో స్థానంలో ఉన్నాడు.
Read Also: IND vs AUS: వర్షం వల్ల 18 ఓవర్లకు మ్యాచ్ కుదింపు
91 టీ20లు ఆడిన సూర్య
ఇప్పటివరకు 91 టీ20 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 165కి పైగా స్ట్రైక్ రేట్‌తో, 37 సగటుతో 2,650కి పైగా పరుగులు సాధించాడు. సూర్యకుమార్ ఇప్పటివరకు 4 సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు చేశాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, భారత గడ్డపై… ఇలా నాలుగు వేర్వేరు దేశాల్లో టీ20 శతకాలు బాదిన ఏకైక ఆటగాడిగా సూర్యకుమార్ అరుదైన రికార్డు కూడా ఉంది. ఇకపోతే, ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ వికెట్ త్వరగా కోల్పోయిన తర్వాత సూర్య (39*), శుభ్‌మన్ గిల్ (37*) ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. భారత్ 9.4 ఓవర్లలో వికెట్ నష్టానికి 97 పరుగులు చేసిన దశలో వర్షం అడ్డుపడింది. మొదట మ్యాచ్‌ను 18 ఓవర్లకు కుదించినప్పటికీ, వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.


