IND vs ENG 2nd Test: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు చివరి రోజు ఆటకు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఆట ప్రారంభానికి ముందే వర్షం పడటంతో స్టేడియంను కవర్స్‌తో కప్పి ఉంచారు. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూంకే పరమితమయ్యారు. వర్షం రాక భారత్ విజయం మీద నీళ్లు చల్లేలా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే ఏడు వికెట్లు తీస్తే చాలు. కానీ ఇంగ్లాండ్ గెలవాలంటే 500 పరుగులకు పైగా చేయాలి. ఇప్పుడు వాన తగ్గకుండా కంటిన్యూగా పడితే మాత్రం మ్యాచ్ డ్రా అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదిలా ఉంటే భారీ స్కోర్ చూసి ఇంగ్లాండ్ భయపడి డ్రా చేసుకుంటుందా అని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే బ్యాటింగ్ కోచ్ మార్కస్ ట్రెస్కోథిక్ మాత్రం ఇందుకు భిన్నంగా సమాధానం ఇచ్చాడు. భారత్ 550 పరుగులను లక్ష్యంగా నిర్దేశిస్తుందని భావించామన్నారు. కానీ 600 పరుగులకు పైగా టార్గెట్ ఇచ్చిందన్నారు. ఇప్పుడు తాము చివరి రోజు 536 పరుగులు చేయాలన్నారు. దీంతో బ్యాటింగ్ ఎలా దూకుడుగా చేస్తామనదే ముఖ్యమని తెలిపారు. మ్యాచ్ ప్రారంభమైతే కచ్చితంగా విజయం కోసమే ఆడతామని స్పష్టం చేశారు. అలాగే బ్రూక్ కూడా భారత్ ఎంత టార్గెట్ నిర్దేశించినా ఛేదిస్తామని చెప్పుకొచ్చాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల స్కోరుకు ఆలౌట్ అయింది. ఇక ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో భారత్‌కు 180 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా 427/6 పరుగులతో అదరగొట్టింది. గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 161 పరుగులతో రాణించాడు. దీంతో ఇంగ్లీష్ జట్టుకు 608 పరుగుల భారీ టార్గెట్ విధించింది. భారీ లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ జట్టు 72 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో హ్యారీ బ్రూక్(15), పోప్(24) పరుగులతో ఉన్నారు. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ 2, మహ్మద్ సిరాజ్ ఓ వికెట్ తీశారు.