IND vs ENG Live Updates: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఉత్కంఠభరితంగా సాగుతోంది. విజయం కోసం ఇరుజట్లు నువ్వా-నేనా అన్న రీతిలో పోరాడుతున్నాయి. నాలుగో రోజు టీ విరామం వరకు టీమిండియా విజయం లాంచనమే అనుకున్న వారిందరికీ షాకిస్తూ ఆతిథ్య జట్టు రేసులోకి వచ్చింది. ఇంగ్లీష్ బౌలర్ల దెబ్బకు రెండో ఇన్నింగ్స్ లో 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి నాలుగో రోజు ఆటను ముగించింది గిల్ సేన. భారత్ గెలవాలంటే మరో 135 పరుగులు చేయాలి. చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి. ప్రస్తుతం రాహుల్ ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు.
నాలుగో రోజు ఆట కొనసాగించిన స్టోక్స్ సేన 192 పరుగులకే ఆలౌట్ అయింది. జో రూట్ (40) టాప్ స్కోరర్. టీమిండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. బుమ్రా, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాను ఇంగ్లీష్ బౌలర్లు ఉక్కిరి బిక్కిరి చేశారు. ఓపెనర్ జైస్వాల్ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు.
అనంతరం రాహుల్, కరుణ్ నాయర్ ఆచితూచి ఆడారు. వీరిద్దరూ క్రీజులో కుదురుకుంటున్న సమయంలోనే కార్సే భారత్ ను దెబ్బకొట్టాడు. నాయర్ ను ఔట్ చేసి తమ జట్టును పోటీలోకి తెచ్చాడు. కాసేపటికే కెప్టెన్ గిల్ కూడా ఔటయ్యాడు. నైట్ వాచ్ మెన్ గా వచ్చిన ఆకాశ్ దీప్ ను ఔట్ చేసి నాలుగో రోజు ఆటను ముగించింది ఇంగ్లాండ్. రాహుల్ ఒక్కడే 33 పరుగులతో ఆడుతున్నాడు. కార్సే రెండు వికెట్లు తీశాడు. ఐదు టెస్టుల సిరీస్ లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సరి సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఆదిక్యంలోకి వెళ్తుంది.
స్కోరు వివరాలు:
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 387/10
టీమిండియా తొలి ఇన్నింగ్స్: 387/10
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్: 192/10
టీమిండియా రెండో ఇన్నింగ్స్: 58/4


