Ind Vs Eng 4TH Test, Day 3 Updates: మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పట్టు బిగించింది. జో రూట్ సెంచరీతో చెలరేగడంతో ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఏడు వికెట్లు కోల్పోయి 544 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 189 పరుగుల ఆధిక్యంలో ఉంది. క్రీజులో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ 77 పరుగులతోనూ, లియామ్ డాసన్ 21 పరుగులతోనూ బ్యాటింగ్ చేస్తున్నారు. జడేజా, సుందర్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఓవర్ నైట్ స్కోరు 225/2తో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన స్టోక్స్ సేన భారీ స్కోరును సాధించింది. ముఖ్యంగా జో రూట్, ఒల్లీ పోప్ (71)తో కలిసి మూడో వికెట్ కు విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరి విజృంభణతో లంచ్ వరకు వికెట్లు పడలేదు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ దెబ్బకు ఇంగ్లండ్ వెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. పోప్, బ్రూక్ ను ఔట్ చేసి ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు.
Also Read: Joe Root- టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన జో రూట్.. ఇక మిగిలింది ఒక్కడే!
ఈ క్రమంలో రూట్ కు జతకలిసిన కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలుత ఆచితూచి ఆడాడు. ఆ తర్వాత ఇరువురు పోటీపడి మరీ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలో రూట్ సెంచరీతోపాటు 150 పరుగుల మార్క్ ను కూడా అందుకున్నాడు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని జడేజా విడదీశాడు. రూట్ ను ఔట్ చేసి 150 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. అనంతరం ఇంగ్లీష్ జట్టు జేమ్స్ స్మిత్,వోక్స్ వికెట్లును కోల్పోయింది. అయితే స్టోక్స్ డాసన్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ఇప్పటికే 186 పరుగుల ఆధిక్యంలో ఉన్న స్టోక్స్ సేన నాలుగో రోజు మరిన్ని పరుగులు రాబట్టి భారత్ పై పై చేయి సాధించాలని చూస్తోంది.


