India vs England must-win Test: ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే 1-2తో వెనుకబడిన టీమిండియా, నేటి నుంచి మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇంగ్లాండ్‌తో నాలుగో టెస్టుకు సిద్ధమైంది. ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు, సిరీస్‌ను సజీవంగా ఉంచుకోవాలంటే గెలవక తప్పని యుద్ధం. కీలక ఆటగాళ్ల గాయాలు, పేలవమైన రికార్డు ఉన్న మైదానం, వర్షం ముప్పు వంటి అనేక ప్రతికూలతల మధ్య శుభ్‌మన్ గిల్ సేన బరిలోకి దిగుతోంది.
గెలుపు అంచున నిలిచి:
లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఓటమి, బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండో టెస్టులో ఘన విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసిన భారత్, లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో గెలుపు అంచులదాకా వచ్చి 22 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇప్పుడు సిరీస్‌ను కోల్పోకుండా ఉండాలంటే మాంచెస్టర్ టెస్టులో భారత్ తప్పనిసరిగా గెలవాలి. అయితే, ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో టీమిండియాకు ఏమాత్రం మంచి రికార్డు లేదు. ఇక్కడ టెస్టు మ్యాచ్ గెలవడం భారత్‌కు ఇప్పటివరకు సాధ్యం కాలేదు, ఇది జట్టుపై మరింత ఒత్తిడిని పెంచుతోంది.
గాయాల గండం… జట్టు కూర్పు చిక్కేనా:
లార్డ్స్ ఓటమి బాధ కంటే ఎక్కువగా కీలక ఆటగాళ్ల గాయాలు జట్టును కలవరపెడుతున్నాయి. ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మోకాలి గాయంతో సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. నెట్స్‌లో బౌలింగ్ చేస్తూ గాయపడిన యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఈ టెస్టుకు అందుబాటులో లేకుండా పోయాడు. మరో పేసర్ ఆకాశ్ దీప్ కూడా గాయంతో ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఈ ముగ్గురు ఆటగాళ్ల సేవలను కోల్పోవడం జట్టు కూర్పుపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా, ముగ్గురు ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగే విజయవంతమైన ఫార్ములాను భారత్ మార్చుకోవాల్సి వస్తోంది.
ఆశలన్నీ వారిపైనే:
ప్రతికూలతల మధ్య కొన్ని సానుకూల అంశాలు జట్టుకు ఊరటనిస్తున్నాయి. పనిభారం కారణంగా గతంలో విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ కీలక మ్యాచ్‌కు తిరిగి జట్టులోకి రావడం బౌలింగ్ విభాగానికి కొండంత అండ. అతని రాకపై మాజీ ఆటగాళ్లు సైతం హర్షం వ్యక్తం చేశారు. మూడో టెస్టులో వేలి గాయంతో ఇబ్బందిపడిన వైస్-కెప్టెన్ రిషభ్ పంత్ పూర్తిగా కోలుకుని, వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. బ్యాటింగ్‌లో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా నిలకడగా రాణిస్తుండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది.
ఇంగ్లాండ్ XI ఇదే:
మరోవైపు, లార్డ్స్ విజయంతో ఇంగ్లాండ్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఆతిథ్య జట్టు ఇప్పటికే తమ తుది జట్టును ప్రకటించింది. గాయపడిన స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో ఎనిమిదేళ్ల తర్వాత అనుభవజ్ఞుడైన స్పిన్నర్ లియామ్ డాసన్‌ను జట్టులోకి తీసుకున్నారు. మిగతా జట్టులో ఎటువంటి మార్పులు చేయలేదు.
పిచ్, వాతావరణం ఎలా ఉంది:
సాంప్రదాయకంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ పిచ్ పేస్, బౌన్స్‌కు అనుకూలిస్తుంది. కానీ ఇటీవలి కాలంలో పిచ్ వేగం తగ్గి బ్యాటింగ్ కు కూడా సహకరిస్తోంది. అయితే, మ్యాచ్ జరిగే ఐదు రోజులూ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, వాతావరణం పేసర్లకు అనుకూలించి, టాస్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.
తుది జట్ల అంచనా
భారత్ : యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్/సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్/వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అన్షుల్ కంబోజ్ (అరంగేట్రం).
ఇంగ్లాండ్ : జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, లియామ్ డాసన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.


