నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో భారత్(IND vs ENG) విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. 249 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు త్వరగా వికెట్ కోల్పోయినా.. తర్వాతి బ్యాటర్లు గిల్, శ్రేయస్ అద్భుతంగా ఆడి భారత ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.
ఈ క్రమంలో అయ్యర్ అవుట్ కాగా అనూహ్యంగా కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాల కంటే ముందుగా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్(Axar Patel) బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకొచ్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొంటూ ధాటిగా బ్యాటింగ్ చేసి 52 పరుగులు రాబట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. తన బ్యాటింగ్ ఆర్డర్ గురించి అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. తాను బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగానే వస్తానన్న విషయం ఊహించానని తెలిపాడు. ఇక మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేయడం ఆనందంగా ఉందని చెప్పాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ బట్లర్ (52), జాకబ్ (51) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఫిలిప్ సాల్ట్ 43 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో అరంగేట్ర బౌలర్ హర్షిత్ రాణా తొలి మ్యాచ్‌లోనే కీలకమైన 3 వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. ఇక రవీంద్ర జడేజా 3 వికెట్లు.. షమి, అక్షర్ పటేల్, కుల్‌దీప్ తలో వికెట్ తీశారు.
నిర్ణీత లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా ఆదిలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు. భ్‌మన్ గిల్ (87), శ్రేయస్ అయ్యర్ (59) అక్షర్ పటేల్ (52) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ 38.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. జోఫ్రా ఆర్చర్, జాకబ్ బెథెల్ తలో వికెట్ సాధించారు.