India Vs England, 3rd Test Highlights: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టు హోరాహోరీగా సాగింది. నువ్వా-నేనా అన్నట్లు జరిగిన ఈ పోరులో చివరకు విజయం ఇంగ్లీష్ జట్టును వరించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయింది. జడేజా(61) పోరాడిన అతడికి సహకరించే బ్యాటర్ లేకపోవడంతో గిల్ సేన 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. తాజా గెలుపుతో స్టోక్స్ సేన ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 తో ముందంజలో ఉంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మెుదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన స్టోక్స్ సేన తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులే చేయగలిగింది. ఆ జట్టు బ్యాటర్లలో జో రూట్ సెంచరీతో మెరవగా.. జేమీ స్మిత్(51), కార్స్ (56) అర్థ సెంచరీలు చేశారు. బుమ్రా ఐదు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన గిల్ సేన తొలి ఇన్నింగ్స్ ఆతిథ్య జట్టు చేసినన్ని పరుగులే చేసింది. టీమిండియా తరపున రాహుల్ సెంచరీ చేయగా.. రిషభ్ పంత్(74), రవీంద్ జడేజా(72) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లాండ్ తరపున వోక్స్ మూడు వికెట్లు పడగొట్టాడు.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 192 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు ఆటగాళ్లలో జో రూట్(40)దే టాప్ స్కోర్. వాషింగ్టన్ సుందర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. అనంతరం 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది జైస్వాల్ డకౌట్ కాగా.. కాసేపటికే కరుణ్ నాయర్, గిల్, నైట్ వాచ్ మెన్ గా వచ్చిన ఆకాశ్ దీప్ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో గిల్ సేన 58 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి నాలుగో రోజు ఆటను ముగించింది.
ఐదో రోజు ఆటను ప్రారంభించిన భారత్ కు మళ్లీ ఇంగ్లాండ్ షాకిచ్చింది. పంత్ 9 పరుగుల మాత్రమే చేసి ఔటయ్యాడు. ఆదుకుంటాడనుకున్న రాహుల్(39) కూడా వెనువెంటనే ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాషింగ్టన్ సుందర్ డకౌట్ అయ్యాడు. దీంతో టీమిండియా ఓటమి దాదాపు ఖాయమైపోయింది.
అయినా సరే భారత బ్యాటర్లు పట్టు వదల్లేదు. ఇంగ్లీష్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. నితీష్, జడేజా ఆచితూచి ఆడుతూ స్కోరు చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని వోక్స్ విడదీశాడు. నితీశ్( 13) ను ఔట్ చేసి భారత్ కు షాకిచ్చాడు. అయితే ఓ ఎండలో జడేజా మాత్రం పాతుకుపోయాడు. టెయిలెండర్ల సహకారంతో జట్టును విజయానికి చేరువగా తీసుకొచ్చాడు. బుమ్రా, సిరాజ్ వారి శక్తి మించి పోరాడిన వికెట్లు కోల్పోక తప్పలేదు. జడ్డూ 61 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. స్టోక్స్, ఆర్చర్ చెరో మూడు వికెట్లు తీశారు.


