వరుస విజయాలతో టీమిండియా జోరుమీదుంది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో ఇప్పటికే కోల్‌కతా, చెన్నైలో జరిగిన మ్యాచుల్లో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లోనూ రెండో టీ20లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఐదు టీ20ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. సిరీస్‌ను రాజ్‌కోట్‌లోనే కైవసం చేసుకోవాలని చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచ్‌లో గెలిచి ఇంగ్లండ్ బోణీ కొట్టాలని భావిస్తోంది.
టీమిండియా టీ20 సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌కు ఒక రోజు ముందే తుది జట్టును అనౌన్స్ చేస్తున్న ఇంగ్లండ్.. మూడో మ్యాచ్ ముందు కూడా అదే పని చేసింది. మూడో టీ20 ఆడే జట్టును ప్రకటించింది. తొలి టీ20లో ఆడిన జట్టులో ఒక మార్పు చేసి రెండో టీ20 బరిలోకి దిగిన ఆ టీమ్.. మూడో మ్యాచ్‌కు మాత్రం ఎలాంటి మార్పులు చేయడం లేదు. బెన్ డకెట్, ఫిల్ సాల్ట్, కెప్టెన్ జోస్ బట్లర్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టన్, జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ స్పిన్‌తో బరిలోకి దిగనుంది.
భారత్ విషయానికి వస్తే.. కెప్టెన్ సూర్యకుమార్ ఫామ్ ఆందోళనకరంగా మారింది. గతేడాది సూర్యకుమార్ టీమిండియా టీ20 జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన సమయంలో బ్యాటింగ్‌తో అలరించాడు. కానీ, కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాక పరుగులు తీయడంలో ఇబ్బందిపడుతున్నాడు. టీ20ల్లో అత్యుత్తమ బ్యాటర్స్‌లో ఒకడైన సూర్యకుమార్.. 17 ఇన్నింగ్స్‌లో 26.18 సగటుతో 429 పరుగులు చేశాడు. పేలవమైన ఫామ్ కారణంగా సూర్యకుమార్ చాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కించుకోలేకపోయాడు.
ఇంగ్లాండ్‌తో ప్రస్తుత టీ20 సిరీస్‌లోని తొలి రెండు మ్యాచుల్లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. రాబోయే మ్యాచుల్లోనైనా బ్యాట్‌తో రాణించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఓపెనర్ సంజు కూడా మూడో మ్యాచ్‌లో రాణించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అభిషేక్ శర్మ తొలి మ్యాచ్‌లో అదరగొట్టినా రెండో మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు, తిలక్ వర్మ రెండో మ్యాచ్‌లో ఒంటి చేతితో గెలిపించాడు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రమణ్‌దీప్ సింగ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తిలు.. రాణిస్తున్నారు.
రాజ్‌కోట్ మైదానంలో టీ-20 ఫార్మాట్‌లో ఇప్పటి వరకు ఇంగ్లాండ్‌తో ఆడలేదు. ఇరుజట్లు టీ20 మ్యాచ్‌లో ఆడుతుండడం ఇదే తొలిసారి. దాంతో మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశం ఉందని అంచనా. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకే విజయ అవకాశాలు ఉండగా.. టాస్ కీలకం కాబోతున్నది. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు మొదలవుతుంది.