Thursday, October 24, 2024
HomeఆటIND vs NZ: ముగిసిన తొలి రోజు ఆట.. ఆదిలోనే టీమిండియాకు షాక్

IND vs NZ: ముగిసిన తొలి రోజు ఆట.. ఆదిలోనే టీమిండియాకు షాక్

IND vs NZ| పుణె వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య కివీస్.. మొదటి ఇన్నింగ్స్‌లో 259 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్‌ శర్మ(Rohit Sharma) డకౌట్‌గా వెనుదిరిగి అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. టిమ్‌ సౌథీ బౌలింగ్‌లో హిట్ మ్యాన్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆ కాసేపటికే తొలి రోజు ఆట ముగిసినట్లు అంపైర్లు ప్రకటించారు. ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 16/1 పరుగులుగా ఉంది. ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ (6), యశస్వి జైస్వాల్ (10‌) నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 243 పరుగుల వెనుకంజలో ఉంది.

- Advertisement -

అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు గౌరవప్రదమైన స్కోర్ చేసింది. కివీస్ బ్యాటర్లలో ఓపెనర్ డేవన్ కాన్వే (76) పరుగులు, తొలి టెస్టు సెంచరీ హీరో రచిన్ రవీంద్ర(65) పరుగులతో రాణించారు. అయితే మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఓ దశలో 197/4 పరుగులతో పటిష్ట స్థితిలో ఉన్న కివీస్ జట్టును స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ ముప్పతిప్పలు పెట్టాడు. దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత టెస్టు జట్టులోకి వచ్చిన సుందర్ అదరగొట్టాడు. తన స్పిన్ మాయాజాలంతో ఏడు వికెట్లు తీశాడు. ఇందులో ఐదుగురు బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. అంతేకాకుండా టెస్టుల్లో తొలిసారిగా ఐదు వికెట్లు తీశాడు. ఇక మరో సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ మూడు వికెట్లతో రాణించాడు.

కాగా ఈ మ్యాచులో భారత్ మూడు మార్పులతో.. కివీస్ జట్టు ఓ మార్పుతో బరిలో దిగాయి. అందరూ అనుకున్నట్లే కేఎల్ రాహుల్‌ను జట్టు నుంచి తప్పించారు. రాహుల్ స్థానంలో శుభమన్‌ గిల్ జట్టులోకి వచ్చాడు. ఇక కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్ స్థానంలో ఆకాశ్ దీప్ ఆడుతున్నారు. తొలి టెస్టు ఓడిపోయిన భారత్ ఈ మ్యాచులో గెలిచి సిరీస్ సమం చేయాలని పట్టుదలతో ఉంది. ఇలా జరగాలంటే రెండో రోజు ఆటలో భారత్ వికెట్లు కాపాడుకుంటూ భారీ పరుగులు చేయాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News