Ind Vs NZ : ఊహించిందే జరిగింది. వరుణుడు ఆటంకం కలిగించడంతో మూడో వన్డే మ్యాచ్ రద్దైంది. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ ను కివీస్ 1-0 తేడాతో గెలుచుకుంది. తొలి వన్డేలో కివీస్ గెలువగా, మిగిలిన రెండు వన్డేలు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ ను టామ్ లాథమ్ అందుకున్నారు.
క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఇంకో రెండు ఓవర్ల ఆట సాధ్యమై ఉంటే డక్‌వర్త్‌లూయిస్ పద్దతిలో న్యూజిలాండ్ విజయం సాధించేది. 18 ఓవర్ తరువాత వర్షం మొదలైంది. ఎంతకీ తగ్గకపోవడంతో అంఫైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 47.3 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌట్ అయింది. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందీర్ (51; 64 బంతుల్లో 5ఫోర్లు, 1సిక్స్), శ్రేయస్ అయ్యర్(49; 59 బంతుల్లో 8ఫోర్లు) మినహా మిగిలిన వారంతా విఫలం కావడంతో టీమ్ఇండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. కివీస్ బౌలర్లలో మిచెల్, మిల్నేలు చెరో మూడు వికెట్లు తీయగా, సౌథీ రెండు, ఫెర్గూసన్, శాంట్నర్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం 220 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ వర్షం అంతరాయం కలిగించే సమయానికి 18 ఓవర్లకు 104/1 స్కోరుతో నిలిచింది. ఫిల్ అలెన్ 57 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.