Saturday, November 2, 2024
HomeఆటIND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. మ్యాచ్‌పై పట్టు బిగించిన రోహిత్ సేన

IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. మ్యాచ్‌పై పట్టు బిగించిన రోహిత్ సేన

IND vs NZ| ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో రోహిత్ సేన పట్టుబిగించింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో ఓవర్‌నైట్ స్కోర్ 86/4 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా ఆటగాళ్లు శుభమన్ గిల్, రిషబ్ పంత్.. కివీస్ బౌలర్లను ధీటు ఎదుర్కొన్నారు. సింగిల్స్ తీస్తూ ఆడపదడపా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును నెమ్మదిగా పరిగెత్తించారు. ఈ క్రమంలోనే గిల్, పంత్ అర్థసెంచరీలు నమోదుచేశారు. అయితే 60 పరుగుల వద్ద పంత్ ఔట్ అయ్యాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 195/5 పరుగులు చేసింది.

- Advertisement -

లంచ్ బ్రేక్ తర్వాత ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ఆచితూచి ఆడింది. అయితే గిల్ 90 పరుగుల వద్ద ఔటై తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 38 పరుగులతో రాణించాడు. ఈ క్రమంలోనే భారత్ 263 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 28 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక కివీస్ బౌలర్లలో అజాజ్ పటేల్ 5 వికెట్లు.. హెన్రీ, ఇష్ సోదీ, ఫిలిప్స్ చెరో వికెట్ తీశారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన న్యూజిలాండ్‌ జట్టుకు తొలి ఓవర్‌లోనే భారత పేసర్‌ ఆకాశ్‌ దీప్ షాక్ ఇచ్చాడు. అద్భుతమైన ఇన్‌స్వింగర్‌తో టామ్‌ లేథమ్ (1)ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం మిగిలిన ఆటగాళ్లను జడేజా, అశ్విన్ త్వరత్వరగా ఔట్ చేసి మ్యాచ్‌పై పట్టు బిగించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ప్రస్తుతం కివీస్‌ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. విల్‌ యంగ్ (51)మరో సారి అర్థసెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, అశ్విన్‌ 3, ఆకాశ్ దీప్‌, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ఓపెనర్లు లాథమ్‌ (28), కాన్వే (4) తక్కువ పరుగులకే ఔట్ చేశారు. అయితే విల్‌ యంగ్‌ (71), మిచెల్‌ (81) మాత్రం క్రీజులో పాతుక్కుపోయి స్కోర్ బోర్డును పరిగెత్తించారు. తర్వాత వీరిద్దరు ఔట్ కావడంతో మిగిలిన బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5, వాషింగ్టన్‌ సుందర్‌ 4 వికెట్లు తీశారు. కాగా ఇప్పటికే తొలి రెండు టెస్టులు కోల్పోయిన భారత్.. మూడో టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని చూస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News