IND vs NZ| బెంగళూరు వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. ఓవర్ నైట్ స్కోర్ 231/3 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 462 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కివీస్ జట్టుకు 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు ఆటలో భాగంగా తొలి రెండు సెక్షన్లలో బ్యాటర్లు అదరగొట్టారు. ముఖ్యంగా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ ఫోర్లు, సిక్సర్లతో దుమ్మురేపాడు. ఈ క్రమంలోనే 110 బంతుల్లో తన కెరీర్‌లో తొలి సెంచరీ నమోదుచేశాడు. అనంతరం కూడా ధాటికి ఆడుతూ ఝ(150; 195 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్స్‌లు) స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. మరోవైపు రిషబ్ పంత్ కూడా (99; 105 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
అయితే వీరిద్దరు వెంటవెంటనే ఔట్ అవ్వడంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఒకదశలో 400/3తో బలమైన స్థితిలో నిలిచిన టీమిండియా.. కివీస్ బౌలర్లు విజృంభించడంతో వేగంగా వికెట్లు కోల్పోయింది. కేఎల్ రాహుల్ (12), రవీంద్ర జడేజా (5), అశ్విన్ (15) నిరాశపర్చారు. దీంతో 462 పరుగులకు ఆలౌటైంది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 3, విలియం 3, అజాజ్ పటేల్ 2, టిమ్ సౌథీ, గ్లెన్ ఫిలిప్స్ తలో వికెట్ పడగొట్టారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 46 పరుగులకు ఆలౌట్ కాగా.. కివీస్ 402 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. అయితే భారీ ఆధిక్యం ఉన్నా సరే భారత బ్యాటర్లు బలంగా పుంజుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ అర్థసెంచరీలు, సర్ఫరాజ్ సెంచరీతో రాణించడంతో 106 పరుగుల ఆధిక్యం లభించింది.
ఇక ఒకరోజు మాత్రమే ఆట మిగిలి ఉంది. అయితే భారత్ కేవలం 107 పరుగుల లక్ష్యం మాత్రమే ఇవ్వడంతో న్యూజిలాండ్ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే వర్షం పడితే మాత్రం మ్యాచ్ డ్రాగా ముగియనుంది. దీంతో భారత్ అభిమానులు చివరి రోజు వరుణుడు కరుణించాలని ప్రార్థనలు చేస్తున్నారు.