IND vs OMA, Asia Cup 2025: ఆసియా కప్ 2025లో టీం ఇండియా హవా కొనసాగుతోంది. గ్రూప్ దశలో వరుసగా రెండు విజయాలు నమోదు చేసి సత్తా చాటింది. యూఏఈని 9 వికెట్ల తేడాతో, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించిన సూర్యా సేనా ఇప్పటికే సూపర్ 4లో స్థానం దక్కించుకుంది. ఇక లీగ్ దశలో చివరిదైనా నామమాత్రపు మ్యాచ్ లో నేడు( సెప్టెంబరు 19) ఒమన్‌తో తలపడబోతుంది భారత్ జట్టు. ఈ మ్యాచ్ అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో జరుగుతుంది. టాస్ సాయంత్రం 7:30 గంటలకు వేస్తారు. మ్యాచ్ రాత్రి 8:00 గంటలకు మెుదలవుతుంది. ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మరియు సోనీలైవ్ యాప్ లో వీక్షించవచ్చు.
పాక్ తర్వాత ఆ రికార్డు భారత్ దే..
అబుదాబి స్టేడియంలో భారతదేశం వంద శాతం విజయాల రికార్డును కలిగి ఉంది. టీమిండియా ఈ స్టేడియంలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడింది. 2021 T20 ప్రపంచ కప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ జట్టు 66 పరుగుల తేడాతో గెలిచింది. ఇవాళ ఆడబోయే మ్యాచ్ కు చారిత్రాత్మకమైనది, ఎందుకంటే భారత్ జట్టు తన 250వ టీ20 మ్యాచ్ ను ఆడనుంది. పాకిస్థాన్ తర్వాత ఈ మైలురాయిని చేరుకోబోతున్న రెండో జట్టుగా నిలిచింది.
ఆసియా కప్ 2025 పాయింట్ల పట్టికలో గ్రూప్-ఏలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. యూఏఈపై పాక్ గెలవడంతో ఆ జట్టు రెండో స్థానం దక్కించుకుంది. ఒమన్ పై నెగ్గిన యూఏఈ మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయిన ఒమన్ చివరి స్థానంలో నిలిచింది. భారత్, పాక్ టీమ్స్ సూపర్-4లోకి ఎంట్రీ ఇచ్చాయి. మరోవైపు గ్రూప్-బిలో రసవత్తర పోరు కొనసాగుతోంది. అగ్రస్థానంలో శ్రీలంక కొనసాగుతుండగా.. తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ ఉన్నాయి. ఇక ఆఖరి స్థానంలో హాంగ్ కాంగ్ కొనసాగుతోంది.
Also Read: Asia Cup 2025 -యూఏఈపై ఘన విజయం.. సూపర్ 4కు పాకిస్థాన్..
ఇరు జట్లు
భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, హర్షిత్ సింగ్ రాణా, రింకు సింగ్.
ఒమన్ జట్టు: జతీందర్ సింగ్ (కెప్టెన్), హమ్మద్ మీర్జా, వినాయక్ శుక్లా, సుఫ్యాన్ యూసుఫ్, ఆశిష్ ఒడెదెరా, అమీర్ కలీమ్, మహ్మద్ నదీమ్, సుఫ్యాన్ మహమూద్, ఆర్యన్ బిష్త్, కరణ్ సోనావాలే, జికారియా ఇస్లాం, హస్నైన్ అలీ షా, షహైల్ అలీ షా, ఫైసల్ షాకే ముహమ్మద్, ఐ. శ్రీవాస్తవ.


