Arshdeep Singh Creates history in T20I Cricket: ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్‌లో 100 వికెట్లు తీసిన తొలి భారత క్రికెటర్‌గా అర్ష్‌దీప్ సింగ్ నిలిచాడు. సెప్టెంబరు 19న భారత్, ఒమన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అతడు ఈ ఫీట్ సాధించాడు. ఒమన్ వినాయక్ శుక్లాను ఔట్ చేయడం ద్వారా అర్ష్‌దీప్ వందో వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ కు ముందు 63 మ్యాచుల్లో 99 వికెట్లు తీశాడు. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన రషీద్ ఖాన్ (53 మ్యాచ్‌లు), శ్రీలంకకు చెందిన వానిందు హసరంగా (63) ఇతడి కంటే ముందున్నారు.
ఇక టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ తర్వాత స్థానాల్లో హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్ బుమ్రాలు వంద వికెట్లకు చేరువలో ఉన్నారు. ఇప్పటి వరకు పాండ్యా 96 మందిని ఔట్ చేయగా..బుమ్రా 92 మందిని పెవిలియన్ కు పంపాడు. నిన్న ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మేనేజ్మెంట్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినివ్వాలని భావించింది. దీంతో అతడి స్థానంలో అర్ష్‌దీప్‌కు జట్టులో చోటు దక్కింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అర్ష్‌దీప్ వికెట్ తీసి చరిత్ర సృష్టించాడు.
భారత్ ను భయపెట్టిన ఒమన్..
శుక్రవారం జరిగిన మ్యాచ్ లో టీమిండియాను భయపెట్టింది ఒమన్. తొలుత బ్యాటింగ్ చేసిన సూర్య సేనా నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. సంజు సామ్సన్(56) అర్ధ సెంచరీతో చెలరేగగా.. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, అక్షర్ పటేల్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆ జట్టు బౌలర్లలో పైజల్, జితేన్ రామనందు, కలీమ్ రెండేసి వికెట్లు తీశారు.
Also Read: Asia Cup 2025 – భారత్‌ను వణికించిన ఒమన్
ఛేజింగ్ లో భారత్ ను కలవరపెట్టింది ఒమన్. ఓపెనర్లు జతీందర్, అమీర్ కలీమ్ టీమిండియా బౌలర్లను సునాయసంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. తొలి వికెట్ తీయడానికి భారత్ ఎనిమిది ఓవర్లపాటు శ్రమించాల్సి వచ్చింది. 32 పరుగుల చేసిన కెప్టెన్ జతీందర్ ను కులదీప్ పెవిలియన్ కు చేర్చాడు. అనంతరం కలీమ్ కు జతకలిసిన హమాద్ మీర్జా కూడా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో కలీమ్(64), మీర్జా(51) హాఫ్ సెంచరీలు సాధించారు. అయితే కొట్టాల్సిన స్కోరు ఎక్కువగా ఉండటంతో ఆ జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 21 పరుగుల తేడాతో ఒమన్ పై నెగ్గింది.


