Ind vs Pak Asia Cup 2025: ఆసియాకప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా నేడు(సెప్టెంబర్ 14) భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జట్లు తలపడనున్నాయి. అయితే ఎప్పుడైనా క్రికెట్‌లో దాయాదుల పోరు అంటే సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. కానీ పహల్గాంలో ఉగ్ర దాడి నేపథ్యంలో గతంతో పోలిస్తే ఈసారి మ్యాచ్‌పై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి కనిపించట్లేదు. అయితే ఒకసారి మైదానంలోకి దిగిన తర్వాత పరిస్థితి మారే అవకాశం ఉంది.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో దాడి తర్వాత భారత్, పాక్ తలపడనుండటం ఇదే తొలిసారి. దుబాయ్ వేదికగా రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి.. ఆధిపత్యం ప్రదర్శించాలని ఇరు జట్లు ఎదురుచూస్తున్నాయి. యువ ఆటగాళ్లతో ఈ జట్లు బరిలోకి దిగుతుండగా.. దుబాయ్ వేదికగా నేడు రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Also Read: https://teluguprabha.net/sports-news/suryakumar-yadav-captains-india-on-birthday-in-asia-cup-2025/
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ మ్యాచ్ బరిలోకి భారత్ దిగుతోంది. ఇప్పటికే పలు టోర్నీల్లో పాకిస్థాన్‌పై భారత్ తిరుగులేని రికార్డులు కొనసాగిస్తుండగా.. ఈసారి కూడా అదే రిపీట్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలనే డిమాండ్‌లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ సాధ్యాసాధ్యాలపై అనేక అనుమానాలు నెలకొనడంతో పాటు.. మ్యాచ్‌ను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోయింది.
ఇక, పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు.. ఈ మ్యాచ్‌ను చూడకుండా టీవీలు ఆఫ్ చేయాలని కోరుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు సైతం మద్దతు పలికాయి. సోషల్ మీడియాలో #BoycottIndvsPak హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. బహిష్కరణ పిలుపులు తారాస్థాయికి చేరడంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
భారత్- పాక్ మ్యాచ్‌ను రద్దు చేయాలని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయగా క్రికెట్‌ను రాజకీయాలతో ముడిపెట్టలేమని పిటిషన్లపై విచారణ జరిపేందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన పాక్ ఉగ్రమూకల దాడిలో 26 మంది చనిపోయారు. ఇందుకు ప్రతిస్పందగా భారత్ ఆపరేషన్ సిందూర్‌తో దీటుగా బదులిచ్చింది. పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడంతో దాయాది దేశం విలవిలలాడిపోయింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్‌తో సంబంధాలు పెట్టుకోవద్దని భారత్ నిర్ణయించుకుంది. అయితే అంతర్జాతీయ వేదికలపై జరిగే క్రీడా పోటీలకు మాత్రం ఇందులో మినహాయింపు ఉంది. దీంతో ఆందోళనల నేపథ్యంలో ఈ మ్యాచ్ నిర్వహణపై ఆసక్తి నెలకొంది.


