IND Vs PAK Match Controversy, Asia Cup 2025: ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పై టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాక్ క్రికెటర్లకు కరచాలనం ఇవ్వడానికి నిరాకరించి నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపోయారు. ఈ ఘటనపై తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అవసరమైతే ఈ మెగా టోర్నీ నుంచి వైదొలగడానికి కూడా సిద్ధమేనని ప్రకటించింది. అంతేకాకుండా పీసీబీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను వెంటనే తొలగించాలని ఐసీసీకి అధికారికంగా ఫిర్యాదు చేసింది.
చాలా నిరాశ చెందాను..
టాస్ సమయంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘాను భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తో కరచాలనం చేయవద్దని పైక్రాఫ్ట్ కోరినట్లు ఆరోపణలు ఉన్నాయని పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ్వీ వెల్లడించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి మరియు క్రికెట్ స్ఫూర్తికి సంబంధించిన MCC చట్టాలను మ్యాచ్ రిఫరీ ఉల్లంఘించినట్లు పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. ఆసియా కప్ నుండి మ్యాచ్ రిఫరీని వెంటనే తొలగించాలని పీసీబీ డిమాండ్ చేసింది. ”భారత్, పాక్ మ్యాచ్ లో క్రీడా స్ఫూర్తి లేకపోవడం చూసి చాలా నిరాశ చెందాను.. ఆటలోకి రాజకీయాలను లాగడం క్రీడల స్ఫూర్తికి విరుద్ధమని” ఈ సందర్భంగా నఖ్వీ వ్యాఖ్యానించాడు.
Also Read: Asia Cup 2025 -సూపర్ 4కు టీమిండియా.. పాక్ పరిస్థితి ఏంటి?
స్పందించిన సూర్య..
టీమిండియా అలా చేయడానికి గల కారణాన్ని జట్టు కెప్టెన్ సూర్యకుమార్ స్పష్టం చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన బాధితులకు, ‘ఆపరేషన్ సిందూర్’లో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు నివాళి అర్పిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని సూర్య తెలిపారు. ఈ గెలుపును అమరవీరుల కుటుంబాలకు, భారత సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నాడు. పీసీబీ హెచ్చరికల నేపథ్యంలో ఐసీసీ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.


