Asia Cup 2025 IND vs PAK: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆసియా కప్-2025లో భారత్- పాకిస్థాన్ జట్ల మధ్య వివాదం తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లపై ఐసీసీ చర్యలు చేపట్టింది. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పాక్ పేసర్ హారిస్ రవూఫ్‌కీ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించింది.
ఆసియా కప్ గ్రూప్ దశలో పాక్‌పై భారత్ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులకు, భారత సైన్యానికి అంకితం ఇస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేయగా.. ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ సూర్యకుమార్‌పై విచారణ జరిపారు. ఈ వ్యవహారంలో సూర్యకుమార్ నిర్దోషి అని తేల్చినా.. ఇకపై టోర్నమెంట్లో రాజకీయ ప్రకటనలు ఏవీ చేయవద్దని స్పష్టం చేసింది. అనంతరం సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ఫీజులో ఐసీసీ 30 శాతం జరిమానా విధించింది.
కాగా, సూపర్-4లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో రెచ్చగొట్టేలా ప్రవర్తించిన పాకిస్థాన్ ఆటగాళ్లపై బీసీసీఐ ఫిర్యాదు నేపథ్యంలో ఐసీసీ పాక్ టీంకు ఝలక్ ఇచ్చింది. యుద్ధ విమానాలు కూలినట్లు 6-0అని సైగలు చేసిన పాక్ పేసర్ హారిస్ రవూఫ్‌నకు మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత పెట్టింది. అదే మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గన్ షాట్ చూపిస్తూ హావభావాలు ప్రదర్శించిన పాక్ బ్యాటర్ షాహిబ్‌జాదా ఫర్హాన్‌కు మాత్రం జరిమానా విధించకుండా హెచ్చరించి వదిలేసింది.
ఆదివారం భారత్-పాక్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, సూర్యకుమార్‌పై విధించిన జరిమానాకు వ్యతిరేకంగా బీసీసీఐ అప్పీల్ దాఖలు చేసినట్లు సమాచారం. పహల్గాం ఉగ్రదాడి బాధితులకు సంఘీభావంగా టాస్ సమయంలో, పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి భారత ఆటగాళ్లు నిరాకరించడంతో ఇరు జట్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.


