India vs Pakistan, Women’s ODI World Cup 2025: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు 50 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌట్ అయింది. కొలంబోలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకోగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మిడిలార్డర్ దూకుడుగా ఆడటంతో ప్లేయర్లు విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో పాక్ 248 లక్ష్యంతో బరిలోకి దిగింది..
ఓపెనర్లు ప్రతికా రావల్, స్మృతి మంధాన తొలి వికెట్‌కు 48 పరుగులు జోడించి మంచి ఆరంభాన్ని అందించారు. స్మృతి మంధాన 32 బంతుల్లో 23 పరుగులు చేసి ఔట్ అయింది. ఆ వెంటనే ప్రతికా రావల్ 37 బంతుల్లో 31 పరుగులు చేసి సాదియా ఇక్బాల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది.
కాగా, టాప్ ఆర్డర్ త్వరగా పెవిలియన్ చేరినా.. హర్లీన్ డియోల్ నిలకడగా ఆడటంతో 65 బంతుల్లో 46 పరుగులతో టాప్ స్కోర్ చేసింది. టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 34 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేసి డయానా బైగ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. ఇక జెమీమా రోడ్రిగ్స్ 37 బంతుల్లో 32, స్నేహ్ రాణా 20 పరుగులు చేయగా.. డెత్ ఓవర్లలో రిచా ఘోష్ దూకుడుగా ఆడి 35 పరుగులతో అజేయంగా ఆడి భారత జట్టుకు మంచి స్కోరును అందించింది.
Also Read: https://teluguprabha.net/sports-news/indian-team-new-captain-shubman-gill/
ఇక పాకిస్తాన్ బౌలర్ డయానా బేగ్ నాలుగు వికెట్లు తీసింది. కెప్టెన్ ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ తలా రెండు వికెట్లు తీసి తమ ఖాతాలో వేసుకున్నారు. రమీన్ షమీమ్, నష్రా సంధు తలో వికెట్ పడగొట్టారు.
కాగా, టీమిండియా మహిళల జట్టుకు దోమల బెడద ఆటంకంగా మారింది. మ్యాచ్ ప్రారంభంలో వాటి సంఖ్య తక్కువగా ఉన్నా.. మ్యాచ్ సాగుతున్న కొద్దీ వాటి సంఖ్య క్రమంగా ఎక్కువైంది. సమస్య చాలా తీవ్రంగా మారడంతో మ్యాచ్‌కు 15 నిమిషాలు ఆటంకం ఏర్పడింది. అనంతరం దోమలను కంట్రోల్ చేసే బృందం పలు పరికరాలతో గ్రౌండ్‌లోకి వచ్చి స్ప్రే చేశారు.


