Asia Cup 2025 Super- 4 IND vs Pak: ఆసియా కప్-2025 లో భాగంగా దుబాయ్ వేదికగా రసవత్తర పోరు మొదలైంది. సూపర్- 4 లో భాగంగా ఇండియా, పాక్ జట్లు దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. ప్లేయింగ్ ఎలెవన్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి తిరిగి ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చారు. మరోవైపు పాక్ సైతం రెండు మార్పులు చేసింది. హసన్ నవాజ్, ఖష్దిల్ షాను పక్కన పెట్టేశామని సల్మాన్ అఘా చెప్పాడు.
టాస్ సమయంలో టీమిండియా కెప్టెన్ మరోసారి పాక్ కెప్టెన్‌కు కరచాలనం చేయలేదు. ఇదే విషయంపై ఇప్పటి వరకు పాకిస్తాన్ ఫిర్యాదులు చేసినా, ఎటువంటి ప్రయోజనం లేదు. దీంతో మ్యాచ్ తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగనుందని తెలుస్తోంది. గ్రూప్ దశలో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన భారత జట్టు.. ఇప్పుడూ అదే దూకుడుతో దాయాది జట్టు మట్టి కరిపించి పెహల్గాం మృతులకు నివాళిగా అర్పించాలని ఉవ్విళ్లూరుతోంది. మరో వైపు గత మ్యాచ్‌లో ఓటమిని జీర్ణించుకోలేని పాకిస్థాన్.. ఈ మ్యాచ్‌లో గెలుపొందాలని తపన పడుతోంది.
భారత్ తుది జట్టు : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
పాక్ తుది జట్టు : సయీం ఆయూబ్, షహిబ్జద ఫర్హాం, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలాట్, మొహమ్మద్ హ్యారిస్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, ఫహీం అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హ్యారిస్ రవుఫ్, అబ్రార్ అహ్మద్.


