Ind vs SA Highlights, 2nd T20I: తొలి టీ20 మ్యాచ్ పరాజయానికి సౌతాఫ్రికా ప్రతీకారం తీర్చుకుంది. గురువారం ముల్లాన్‌పూర్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లో టీమ్ ఇండియాను 51 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 మ్యాచ్ డిసెంబర్ 14న ధర్మశాలలో జరుగబోతుంది.
డికాక్ ఊచకోత
తొలుత టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకుంది. బరిలోకి దిగిన ప్రోటీస్ కు ఓపెనర్ క్వింటన్ డికాక్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. మరో ఓపెనర్ హెండ్రిక్స్ స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. తర్వాత వచ్చిన మారక్రమ్ అండతో డికాక్ రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో టీమ్ ఇండియా బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు. మరోవైపు 26 బంతుల్లో ఫోర్, రెండు సిక్సర్లతో 29 పరుగులు చేసిన మార్క్రమ్ ను వరుణ్ చక్రవర్తి పెవిలియన్ కు పంపాడు. అయితే కాసేపటికే 46 బంతుల్లో ఐదు ఫోర్లు, 7 సిక్సర్లు సహాయంతో 90 పరుగులు చేసిన డికాక్ రనౌట్ అయి.. తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. చివర్లో ఫెరీరా, మిల్లర్ మెరుపులు మెరిపించడంతో ప్రోటీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. వరుణ్ రెండు వికెట్లు తీశాడు.
Also Read: Winter Olympics 2026- ఒలింపిక్స్ కు ముస్తాబవుతున్న పురాతన రోమన్ అరేనా.. దీని ప్రత్యేకత ఏంటంటే?
గిల్, సూర్య ఫ్లాప్ షో.. తెలుగోడి పోరాటం వృథా..
అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ గిల్ డకౌట్ గా వెనుదిరిగాడు. రెండు సిక్సర్లు కొట్టి ఊపు మీదున్న అభిషేక్ కూడా కేవలం 17 పరుగులే చేసి ఔటయ్యాడు. కెప్టెన్ సూర్య మరోసారి నిరాశపరిచాడు. కేవలం ఐదు పరుగులు చేసి పెవిలియన్ కు చేరాడు. ఈ క్రమంలో అక్షర్ కు జతకలిసిన తెలుగు కుర్రాడు తిలక్ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. ఈ క్రమంలో అక్షర్(21) ఔటయ్యాడు. అయితే హార్దిక్ తో కలిసి తిలక్ సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే పాండ్యా 20 పరుగులు చేసి సిపామ్లాకు చిక్కాడు. అనంతరం వచ్చిన జితేష్(27) కూడా బ్యాట్ ఝలిపించాడు. లక్ష్యం ఎక్కువగా ఉండటంతో భారత్ బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. అయితే 34 బంతుల్లో రెండు ఫోర్లు, 5 సిక్సర్లతో 62 పరుగులు చేసి ఔట్ అయ్యాడు తిలక్. అనంతరం చివర బ్యాటర్లు వచ్చిన వాళ్లు వచ్చినట్టే పెవిలియన్ కు క్యూ కట్టారు. దీంతో సూర్య సేన 20 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. బార్టమన్ కు నాలుగు వికెట్లు దక్కాయి.

