Abhishek Sharma Close To Virat Kohli’s Record: టీమ్ ఇండియా యంగ్ సంచలనం అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. తొమ్మిదేళ్ల క్రితం విరాట్ కోహ్లీ నెలకొల్పిన అరుదైన రికార్డును చెరిపేందుకు అత్యంత చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో మూడు టీ20 మ్యాచులు అందుబాటులో ఉండటంతో కింగ్ రికార్డు బద్దలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధిక టీ20 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ లో తొలి రెండు మ్యాచ్‌ల్లో మంచి ఆరంభాలు లభించినా.. వాటిని భారీ స్కోర్లుగా మలచుకోవడంలో అభిషేక్ విఫలమయ్యారు. రెండు గేమ్స్ లోనూ 17 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే మిగిలిన మూడు మ్యాచుల్లో మంచి స్కోర్లు చేయగలిగితే 2016 నాటి విరాట్ కోహ్లీ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 2016 క్యాలెండర్ ఇయర్ లో మెుత్తంగా 31 టీ20 మ్యాచ్‌లు ఆడి ఏకంగా 1,614 పరుగులు చేశాడు. దీంతో ఒక ఏడాదిలో అత్యధిక టీ20 పరుగులు చేసిన టీమ్ ఇండియా ప్లేయర్ గా రికార్డు నెలకొల్పాడు.
ఈ సంవత్సరం అభిషేక్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఇప్పటి వరకు 39 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ స్టార్ ఓపెనర్ 1,533 పరుగులు చేశాడు. ఇప్పటికే ఈ యంగ్ ప్లేయర్ 2022లో సూర్యకుమార్ యాదవ్ (1503) నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. ఇప్పుడు అభిషేక్ కన్ను కింగ్ కోహ్లీ రికార్డుపై పడింది. దీనిని అందుకోవాలంటే అభిషేక్ ఇంకా 82 పరుగులు చేయాలి. ప్రోటీస్ తో మరో మూడు మ్యాచులు మిగిలి ఉండటంతో విరాట్ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉంది.
Also Read: Ind vs SA – మూడో టీ20 మ్యాచ్ నేడే.. వారిద్దరూ ఈసారైనా రాణిస్తారా?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ హోరాహోరీగా సాగుతోంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమానంగా నిలిచాయి. కీలకమైన మూడో టీ20 మ్యాచ్ ఇవాళ ధర్మశాలలో జరగబోతుంది. ఈ పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అభిషేక్ చెలరేగి భారీ ఇన్నింగ్స్ ఆడితే కోహ్లీ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.
Also Read: Match Fixing -భారత క్రికెట్‌లో ఫిక్సింగ్ భూతం.. నలుగురు ప్లేయర్స్ సస్పెండ్!

