Gautam Gambhir’s special gesture: కరేబియన్ జట్టుతో ఇప్పటికే తొలి టెస్టు నెగ్గిన టీమిండియా.. రెండో టెస్టు ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ ఢిల్లీ వేదికగా అక్టోబర్ 10 నుంచి 14 వరకు జరగనుంది. కీలకమైన సెకండ్ టెస్టుకు ముందు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, భారత జట్టును విందుకు ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడట. బుధవారం ఓల్డ్ రాజేందర్ నగర్ ప్రాంతంలో ఉన్న తన లగ్జరీ ఇంట్లో ఉన్న గార్డెన్ ఏరియాలో ఈ విందు భోజనాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పార్టీ అనేది అక్కడి వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఢిల్లీ వర్షం పడితే, ఆ పార్టీని రద్దు చేసే అవకాశం ఉంది. ఈ అనధికార కార్యక్రమం ఆటగాళ్ల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.
గత సంవత్సరం భారత ప్రధాన కోచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గంభీర్ తన నివాసంలో జట్టుకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. గంభీర్ కోచింగ్ లో భారత జట్టు అద్భుతాలు చేస్తోంది. ఏమాత్రం భయం, బెరుకు లేకుండా స్వేచ్ఛగా ఆడుతూ విజయాలు సాధిస్తుంది. తాజాగా ఆసియా కప్ నెగ్గిన టీమ్ ఇండియా..విండీస్ పై టెస్టు సిరీస్ గెలిచేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇప్పటికే సమిష్టిగా రాణించడంతో తొలి టెస్టును సునాయసంగా గెలిచిన భారత్.. మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెండో టెస్టుకు రెడీ అయింది. ఈ మ్యాచ్ ఉదయం 9 30 గంటలకు ప్రారంభం కానుంది.
Also Read: IND vs WI – వెస్టిండీస్ పై భారత్ ఘన విజయం
అహ్మదాబాద్ టెస్టులో భారత జట్టు అద్భుతంగా ఆడింది. తొలుత బౌలర్లు విజృంభించగా.. తర్వాత బ్యాటర్లు చెలరేగిపోయారు. బౌలింగ్ లో సిరాజ్, బుమ్రా, కులదీప్ కీలకపాత్రలు పోషించగా.. బ్యాటింగ్ లో రాహుల్, జురెల్, జడేజా అద్బుతంగా ఆడారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ లో కూడా కరేబియన్ జట్టు కేవలం 146 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

