India vs West Indies, 2nd Test Day 4: ఢిల్లీ టెస్ట్ లో టీమిండియా గెలుపు దాదాపు ఖాయమైపోయింది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప భారత్ గెలుపును ఎవ్వరూ ఆపలేరు. రెండో ఇన్నింగ్స్ లో మరో 58 పరుగులు చేస్తే భారత్ గెలుస్తుంది. వెస్టిండీస్ పై 121 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో గిల్ సేన వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్ లో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ ఎనిమిది పరుగుల మాత్రమే చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం రాహుల్ 25, సాయి సుదర్శన్ 30 పరుగులతో ఆడుతున్నారు.
సెంచరీలతో చెలరేగిన క్యాంప్ బెల్, హోప్
తొలి ఇన్నింగ్స్ లో 248 పరుగులకు ఆలౌటైన వెస్టిండీస్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం గట్టి పోటీనిచ్చింది. క్యాంప్ బెల్, హోప్ సెంచరీలతో చెలరేగడంతో విండీస్ 390 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది. వీరిద్దరూ మూడో వికెట్ కు 177 పరుగులు పార్టనర్ షిప్ నెలకొల్పారు. కరేబియన్ క్రికెటర్లలో జస్టిన్ లీవ్ హాఫ్ సెంచరీతోనూ, కెప్టెన్ చేజ్ 40 పరుగులతోనూ రాణించారు. చివర్లో సీల్స్ మెరుపులు మెరిపించాడు. చేజ్, సీల్స్ చివరి వికెట్ కు 79 పరుగులు జోడించడం విశేషం. రెండో ఇన్నింగ్స్ లోనూ కుల్ దీప్, బుమ్రా చెరో మూడు వికెట్లు తీశారు.
Also Read: IND-W vs AUS-W -ఉత్కంఠ పోరులో భారత్ పై ఆస్ట్రేలియా ఘన విజయం
గిల్ సేన తన తొలి ఇన్నింగ్స్‌ను 518/5 వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇన్నింగ్స్ లో జైస్వాల్ (175), గిల్(129) సెంచరీలతో చెలరేగగా..సాయి సుదర్శన్(87)పరుగులతో రాణించాడు. నితీష్ రెడ్డి 43, ధ్రువ్ జురేల్ 44 పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో వారికన్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కరేబియన్ జట్టు 248 పరుగులకు ఆలౌటైంది. అథనేజ్ చేసిన 41 పరుగులే అత్యధిక స్కోరు. టీమిండియా బౌలర్లలో కులదీప్ ఐదు, జడేజా మూడు వికెట్లు తీశారు.


