Saturday, November 15, 2025
HomeఆటIND-W vs ENG-W: భారత మహిళల వన్డే సిరీస్ కైవసం.. హర్మన్‌ప్రీత్ శతకం!

IND-W vs ENG-W: భారత మహిళల వన్డే సిరీస్ కైవసం.. హర్మన్‌ప్రీత్ శతకం!

England Vs India: ఇంగ్లాండ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న జోరులోనే, వన్డే సిరీస్‌ను కూడా గెలుచుకుని ఆంగ్లేయుల గడ్డపై తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. నిర్ణయాత్మకమైన మూడో వన్డేలో 13 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుని 2-1 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (102) బాధ్యతాయుతమైన శతకంతో బ్యాటింగ్‌లో వెన్నెముకగా నిలిస్తే, యువ పేసర్ క్రాంతి గౌడ్ (6/52) తన మాయాజాల బౌలింగ్‌తో ఇంగ్లీష్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చింది. ఈ విజయంతో భారత మహిళల జట్టు ఇంగ్లాండ్‌లో చిరస్మరణీయ పర్యటనను ఘనంగా ముగించింది.

- Advertisement -

విజృంభించిన హర్మన్… కదం తొక్కిన క్రాంతి:

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. ఓపెనర్లు స్మృతి మంధాన (45), ప్రతీక రావల్ (26) తొలి వికెట్‌కు 64 పరుగులు జోడించినా, స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు.ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాలపై వేసుకుంది. హర్లీన్ డియోల్ (45)తో కలిసి నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపింది.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (50)తో కలిసి హర్మన్‌ప్రీత్ అసలు సిసలైన విధ్వంసం సృష్టించింది. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 110 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ముఖ్యంగా హర్మన్‌ప్రీత్ తనదైన శైలిలో బౌండరీలతో విరుచుకుపడింది. కేవలం 84 బంతుల్లో 14 ఫోర్లతో 102 పరుగులు చేసి, వన్డేల్లో తన ఏడో శతకాన్ని నమోదు చేసుకుంది. ఇది ఇంగ్లాండ్‌పై ఆమెకు మూడో సెంచరీ కావడం విశేషం. జెమీమా కూడా 45 బంతుల్లో 50 పరుగులు చేసి తన 50వ వన్డేలో మెరిసింది. ఆఖర్లో రిచా ఘోష్ (18 బంతుల్లో 38*) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 318 పరుగుల భారీ స్కోరుతో భారత జట్టు అదరగొట్టింది.ఇది ఇంగ్లాండ్‌పై భారత్‌కు రెండో అత్యధిక స్కోరు.

ALSO READ: https://teluguprabha.net/sports-news/ind-vs-eng-4th-test-manchester-do-or-die-preview/

కుప్పకూలిన ఇంగ్లీష్ జట్టు:

319 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్‌కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. యువ పేసర్ క్రాంతి గౌడ్ తన నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లీష్ టాపార్డర్‌ను వణికించింది. టామీ బ్యూమాంట్ (2), అమీ జోన్స్ (4)లను స్వల్ప స్కోరుకే పెవిలియన్ పంపి హ్యాట్రిక్‌కు చేరువైంది. అయితే, కెప్టెన్ నాట్ సివర్-బ్రంట్ (98), ఎమ్మా లాంబ్ (68) కలిసి మూడో వికెట్‌కు 162 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఇంగ్లాండ్‌ను ఆదుకున్నారు.వీరిద్దరి ఆటతీరుతో ఇంగ్లాండ్ విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది.

కానీ, కీలక సమయంలో దీప్తి శర్మ అద్భుత బౌలింగ్‌తో సివర్-బ్రంట్‌ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పింది.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బ్యాటర్లను క్రాంతి గౌడ్ వరుసగా పెవిలియన్‌కు పంపింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా, సోఫియా డంక్లీ (34), అలిస్ డేవిడ్‌సన్-రిచర్డ్స్ (44) పోరాడినా, విజయానికి చేరువ కాలేకపోయారు. చివరికి ఇంగ్లాండ్ జట్టు 49.5 ఓవర్లలో 305 పరుగులకు ఆలౌట్ అయింది. క్రాంతి గౌడ్ 52 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి, భారత మహిళల వన్డే చరిత్రలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాల్లో ఒకటిగా నిలిచింది. ఈ ప్రదర్శనతో ఆమె అతి పిన్న వయసులో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన భారత పేసర్‌గా రికార్డు సృష్టించింది.

ALSO READ: https://teluguprabha.net/sports-news/cricketer-sarfaraz-khan-loses-17-kilos/

చారిత్రాత్మక విజయం: 

ఈ విజయంతో భారత మహిళల జట్టు టీ20 సిరీస్ (3-2)తో పాటు, వన్డే సిరీస్‌ను (2-1) కూడా కైవసం చేసుకుని ఇంగ్లాండ్ పర్యటనను విజయవంతంగా ముగించింది.ఈ చారిత్రాత్మక విజయం, రాబోయే వన్డే ప్రపంచకప్‌కు ముందు జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుందనడంలో సందేహం లేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad