India Women vs New Zealand Women Match Highlights: మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఆతిథ్య భారత్ సెమీస్ చేరింది. గురువారం జరిగిన కివీస్ తో జరిగిన మ్యాచ్ లో 53 పరుగుల తేడాతో గెలిచింది. తాజా విజయంతో మహిళల నాకౌట్ దశకు చేరుకున్న నాల్గవ జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు సెమీఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ స్మతి మంధానకు లభించింది.
సెంచరీలతో చెలరేగిన స్మృతి, ప్రతీకా..
గురువారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమ్ ఇండియాకు ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్ మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ సెంచరీలతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరు చేసింది. స్మృతి, ప్రతీకా తొలి వికెట్ కు రికార్డు స్థాయిలో 212 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
ప్రతీకా తొలిసారి వరల్డ్ కప్ లో సెంచరీ(122) నమోదు చేసింది. ఈమె ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు మంధాన 95 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లుతో 109 పరుగులు చేసింది. స్మృతి తర్వాత క్రీజులోకి వచ్చిన జెమియా రోడ్రిగ్ మెరుపులు మెరిపించింది. కేవలం 55 బంతుల్లో 76 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. ఇందులో 11 ఫోర్లు ఉన్నాయి. వర్షం కారణంగా మ్యాచ్ ను 49 ఓవర్లకు కుదించడంతో టీమ్ ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 340 పరుగులు చేసింది.
Also Read: IND v AUS Highlights -అచ్చొచ్చిన మైదానంలో దారుణంగా ఓడిన టీమ్ ఇండియా.. సిరీస్ ఆసీస్ వశం..
బ్రూక్ హాలుడే, గేజ్ మెరుపులు..
DLS పద్దతి ప్రకారం, న్యూజిలాండ్ టీమ్ లక్ష్యాన్ని 44 ఓవర్లలో 325 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. ఛేజింగ్ ప్రారంభించిన కివీస్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ బేట్స్ కేవలం ఒక్క పరుగే చేసి ఔటైంది. జార్జియా ప్లిమ్మర్(30), అమేలియా కెర్(45) ఇన్నింగ్స్ ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన న్యూజిలాండ్ ను బ్రూక్ హాలుడే(81), గేజ్(65) ఆదుకున్నారు. వీరిద్దరూ గెలిపించే ప్రయత్నం చేసినప్పటికీ లక్ష్యం పెద్దగా ఉండటంతో వీరు ఏమీ చేయలేకపోయారు. దీంతో ఆ జట్టు 44 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. టీమ్ ఇండియా బౌలర్లలో రేణుక, క్రాంతి గౌడ్ చెరో రెండు వికెట్లు తీశారు.


