IND vs BAN 2nd Test : ఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ను తక్కువ పరుగులకే ఆలౌట్ చేశామన్న ఆనందం కాసేపైనా మిగలలేదు. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునేందుకు బంగ్లా బౌలర్లు గట్టిగానే శ్రమిస్తున్నారు. ముఖ్యంగా స్పిన్నర్లు టీమ్ఇండియా టాప్ ఆర్డర్ బ్యాటర్లను హడలెత్తించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి 45 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (26), జయ్‌దేవ్ ఉనద్కత్ (3) పరుగులతో క్రీజులో ఉన్నారు.
145 పరుగుల స్వల్ప లక్ష్యంతో దిగిన భారత్‌కు బంగ్లా బౌలర్లు గట్టి షాకే ఇచ్చారు. కెప్టెన్ కేఎల్ రాహుల్(2) తన పేలవ ఫామ్ కొనసాగించాడు. తొలి టెస్టులో రాణించిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్(7), నయావాల్ ఛతేశ్వర్ పుజరా(2) లు అనవసరంగా భారీ షాట్లకు యత్నించి స్టంపౌట్ అయ్యారు. ఎంతో సహనంతో బ్యాటింగ్ చేసిన కోహ్లీ(22 బంతుల్లో 1 పరుగు) కూడా పెవిలియన్‌కు చేరుకోవడంతో 37 పరుగులకే టీమ్ఇండియా 4 వికెట్లు కోల్పోయింది. అప్పటికే క్రీజులో కుదురుకున్న అక్షర్ పటేల్, నైట్‌వాచ్‌మెన్ జయ్‌దేవ్ ఉనద్కత్‌తో కలిసి మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిదీ హసన్ మూడు వికెట్లు పడగొట్టగా, కెప్టెన్ షకీబ్ ఒక వికెట్ తీశాడు.
మరో రెండు రోజుల సమయం ఉన్న నేపథ్యంలో టీమ్ఇండియా ఈ మ్యాచ్‌లో గెలవాలంటే మరో 100 పరుగులు అవసరం. అలాగే బంగ్లాదేశ్ విజయానికి 6 వికెట్లు కావాలి. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో భారత విజయంపై సందేహాలు నెలకొన్నాయి. నాలుగో రోజు వికెట్ కీపర్ రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్, అశ్విన్ లు ఎలా రాణిస్తారు అన్నదానిపైనే భారత విజయం ఆధారపడి ఉంది.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 227కు ఆలౌట్ కాగా.. టీమ్ఇండియా మొదటి ఇన్నింగ్స్‌లో 314 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియాకు లభించిన 87 పరుగుల ఆధిక్యాన్ని తీసివేయగా 145 పరుగుల లక్ష్యం నిలిచింది.