Monday, March 3, 2025
HomeఆటInd vs Aus: ఆసీస్ తో సెమీస్ పోరు.. రివెంజ్ కు సిద్ధమైన టీమిండియా..!

Ind vs Aus: ఆసీస్ తో సెమీస్ పోరు.. రివెంజ్ కు సిద్ధమైన టీమిండియా..!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తొలి సెమీస్ (semis) పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రూప్ -ఏ టాప్ పొజిషన్‌లో ఉన్న భారత్ (India) గ్రూప్-బీ లో రెండో స్థానంలో ఉన్న జట్టు అయిన ఆస్ట్రేలియా (Australia)తో తలపడనుంది. దీంతో 2023 ప్రపంచకప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం టీమిండియాకు దక్కింది. మంగళవారం దుబాయ్‌లో జరిగే మొదటి సెమీ-ఫైనల్‌ (Semi-final)లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

ఈ మ్యాచ్ కోసం రెండు జట్లు తీవ్రంగా సన్నద్ధమవుతున్నాయి. టీమిండియా ఆస్ట్రేలియాను దాటి ఫైనల్ కు చేరాలని చూస్తోంది. గ్రూప్-ఎలో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్.. ఆస్ట్రేలియాతో సెమీస్ లోనూ అదే ఫామ్ కొనసాగించాలి. ముఖ్యంగా బ్యాటర్లు పరుగుల వేటను కొనసాగించాలి. బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్, పాకిస్థాన్ పై విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీలు చేశారు. న్యూజిలాండ్ పై శ్రేయస్ అయ్యర్ ఫైటింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంకా రోహిత్, హార్దిక్, అక్షర్ పటేల్ కూడా పరిస్థితులకు తగ్గట్లు రాణిస్తున్నారు. కీలక మ్యాచ్ కావడంతో అందరూ సమిష్టిగా రాణించాల్సి ఉంది.

దుబాయ్ పిచ్: ఇక ఆస్ట్రేలియాతో టీమిండియా మ్యాచ్ ఆడే దుబాయ్ లో పిచ్ స్పిన్నర్లకు చక్కగా సహకరిస్తోందని తెలుస్తోంది. ఈ స్లో పిచ్ పై పరుగులు చేయడం కష్టంగా మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్లు నిలకడ కొనసాగిస్తే జట్టుకు తిరుగుండదు. న్యూజిలాండ్ పై వరుణ్ చక్రవర్తి 5 వికెట్లతో మెరిశాడు. జడేజా, కుల్‌దీప్, అక్షర్ కూడా మిడిల్ ఓవర్లలో ఆకట్టుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా మ్యాచ్ కు కూడా టీమిండియా నలుగురు స్పిన్నర్లతో ఆడే అవకాశం ఉంది.

ఆ ఆటగాళ్లపై ఓ కన్నేయాలి: ఆస్ట్రేలియా ఆటగాళ్లలో ట్రావిస్ హెడ్ ను ముందుగా టీమిండియా కట్టడి చేయాలి. భారత్ అంటే చాలు హెడ్ చెలరేగి ఆడుతున్నాడు. 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో, 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీలతో టీమిండియాకు విజయాన్ని దూరం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ కూడా ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. మరోవైపు కెప్టెన్ స్టీవ్ స్మిత్ విషయంలో కూడా టీమిండియా జాగ్రత్త పడాలి. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ కంటే ముందు స్మిత్ పేలవ ఫామ్ లో ఉన్నాడు. కానీ ఆ సిరీస్ లో భారత్ పై రెండు సెంచరీలు బాదేశాడు. అందుకే స్మిత్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ ఇద్దరినీ వీలైనంత త్వరగా పెవిలియన్ కు పంపించాలి.

గెలవాలంటే: ప్రస్తుత ఆస్ట్రేలియా టీమ్ కాస్త వీక్ గా కనిపిస్తుంది. రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్ తో పాటు హేజిల్ వుడ్, స్టార్క్, మిచెల్ మార్ష్, స్టాయినిస్ లాంటి ప్లేయర్లు జట్టులో లేరు. అయితే ఆసీస్ టీమ్ ఎలా ఉన్నా.. ఐసీసీ టోర్నీ అంటే చాలు చెలరేగి ఆడుతుంది. ఈ సారి కూడా అదే విధంగా ఆడి సెమీస్ కు చేరింది. అందుకే ఆస్ట్రేలియాను తక్కువగా తీసుకోవడానికి లేదు. అందరూ సమిష్టిగా రాణిస్తే మాత్రం.. కంగారూలను కంగారు పెట్టొచ్చు. మరి ఈ మ్యాచ్ ఎలా సాగుతుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News