రోహిత్ సేన ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి పోరుకు సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గురువారం బంగ్లాదేశ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించి టోర్నీకి మంచి ఆరంభం ఇవ్వాలని టీమిండియా ఆశిస్తోంది. ఇటీవల ఇంగ్లండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. ఉత్సాహంతో ఛాంపియన్స్ ట్రోఫీలోకి అడుగు పెట్టింది. మరోవైపు రోహిత్, కోహ్లీలు ఫామ్ లోకి రావడం టీమిండియాకు కలిసొచ్చే అంశమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే గాయం కారణంగా బుమ్రా లేకపోవడం టీమిండియాకు లోటనే చెప్పాలి.
దీంతో అదే ఉత్సాహంతో విజయ పరంపరను కొనసాగించాలని చూస్తోంది టీమిండియా. మరోవైపు బంగ్లాదేశ్ జట్టు ఇటీవలి వన్డే సిరీస్‌లో వెస్టిండీస్ చేతిలో ఓటమిని చవిచూసింది. దీంతో అనేక జాగ్రత్తలు తీసుకుని ఛాంపియన్స్ ట్రోఫీ పోరులో మెరుగైన ప్రదర్శన కనబరచాలని ఆశిస్తోంది.
ఈ క్రమంలో భారత్-బంగ్లాదేశ్ మధ్య హెడ్ టూ హెడ్ రికార్డ్స్ చూస్తే.. ఈ రెండు జట్లు 1988 నుంచి ఇప్పటి వరకు 41 వన్డే మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో 32 మ్యాచ్‌లను భారత్ గెలుచుకోగా, బంగ్లాదేశ్ ఎనిమిది మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఒక మ్యాచ్‌కు ఫలితం రాలేదు. ఈ టోర్నమెంట్‌లో జరిగే మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య 42వ వన్డే పోరుగా నిలవనుంది.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-బంగ్లాదేశ్ లు ఇప్పటి వరకూ ఒకసారి మాత్రమే తలపడ్డాయి.. ఆ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ తటస్థ మైదానమైన దుబాయ్‌లో జరగనుంది. తటస్థ మైదానాల్లో భారత్, బంగ్లాదేశ్ జట్లు 12 సార్లు తలపడగా, భారత్ 10 సార్లు విజయం సాధించగా, బంగ్లాదేశ్ 2సార్లు గెలిచింది. ఇక ఈ ఆసక్తికరమైన పోరు అభిమానులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయం.