India vs Bangladesh: ఇండియా-బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో భారత్ 404 పరుగుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ 75 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత తొలి ఇన్నింగ్స్ చివర్లో బౌలర్లు అశ్విన్ రవిచంద్రన్, కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్‌లోనూ అదరగొట్టారు.
రవిచంద్రన్ అశ్విన్ 113 బంతుల్లో 58 పరుగులు చేయగా, కుల్దీప్ యాదవ్ 114 బంతుల్లో 40 పరుగులు చేసి ఔటయ్యారు. ఆ తర్వాత మహ్మద్ సిరాజ్ 4 పరుగులు చేసి ఔటవ్వగా, ఉమేష్ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో ఇండియా 404 పరుగులకు ఆలౌటైంది. గురువారం ఉదయం రెండోరోజు ఆట ఆరంభించిన ఇండియా శ్రేయస్ అయ్యర్ వికెట్ కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ 192 బంతుల్లో 86 పరుగులు చేశాడు. అయితే, తర్వాత అశ్విన్, కుల్దీప్ కలిసి ఇండియా గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో సాయపడ్డారు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లామ్ 4 వికెట్లు తీయగా, మెహెదీ హసన్ 4 వికెట్లు తీశాడు. ఎడబాట్, ఖలీద్ చెరో వికెట్ తీశారు.
తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాకు ఓపెనింగ్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే ఓపెనర్ నజ్ముల్ హొసైన్ షాంటో ఔటయ్యాడు. మహ్మద్ సిరాజ్ వేసిన బాల్‌కు రిషబ్ పంత్‌కు క్యాచ్ ఇచ్చి వెనదిరిగాడు. తర్వాత వచ్చిన యాసిర్ అలీ కూడా నాలుగు పరుగులకే ఉమేష్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత జకీర్ హసన్ 45 బంతుల్లో 20 పరుగులు, లిటన్ దాస్ 30 బంతుల్లో 24 పరుగులు, షకిబ్ అల్ హసన్ 25 బంతుల్లో 3 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో ముష్ఫికర్ రహీమ్, నురుల్ హసన్ బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలింగ్‌లో మహ్మద్ సిరాజ్ 3 వికెట్లు తీయగా, ఉమేష, కుల్దీప్ చెరో వికెట్ తీశారు.