HomeTop Storiesభారత్‌కు డబుల్ ధమాకా.. సింధు, లక్ష్యసేన్‌ విజయం

భారత్‌కు డబుల్ ధమాకా.. సింధు, లక్ష్యసేన్‌ విజయం

భారత్ డబుల్ ధమాకా

- Advertisement -

హైలో ఓపెన్‌ విజేతలుగా సింధు, లక్ష్యసేన్‌

ఫైనల్లో దుమ్మురేపిన భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్లు

మహిళలు, పురుషుల సింగిల్స్‌ టైటిళ్లు కైవసం

డెన్మార్క్‌, ఇండోనేసియా ఆటగాళ్లపై ఆధిపత్యం

సార్బ్రూకెన్‌ (జర్మనీ), నవంబర్ 1: భారత బ్యాడ్మింటన్‌ అభిమానులకు శుభవార్త. భారత స్టార్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌ హైలో ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నీలో సత్తాచాటారు. ఆదివారం జరిగిన ఫైనల్స్‌లో ఇద్దరూ ప్రత్యర్థులను వరుస గేముల్లో ఓడించి మహిళలు, పురుషుల సింగిల్స్‌ టైటిళ్లను భారత్‌కు అందించారు. తొలుత సింధు 21-12, 21-14తో డెన్మార్క్‌కు చెందిన ఎనిమిదో సీడ్‌ లైన్‌ హోజ్‌మార్క్‌ కెజెర్స్‌ఫెల్డ్‌పై 39 నిమిషాల్లో విజయం సాధించింది. అనంతరం లక్ష్యసేన్‌ 21-17, 21-10తో ఇండోనేసియా ఆటగాడు జొనాటన్‌ క్రిస్టీని ఓడించి టైటిల్‌ అందుకున్నాడు.

ఆరంభం నుంచే సింధు జోరు

మాజీ ప్రపంచ ఛాంపియన్‌ సింధు ప్రత్యర్థిపై ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. క్రాస్‌కోర్టు షాట్లు, నెట్‌ ప్లేతో పాయింట్లు సాధిస్తూ తొలి గేమ్‌లో 8-5 ఆధిక్యంలోకి వెళ్లింది. విరామ సమయానికి మూడు పాయింట్ల ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగిస్తూ 17-12కు చేరింది. ప్రత్యర్థి చేసిన పొరపాట్లను సద్వినియోగం చేసుకున్న సింధు తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు దూకుడు తగ్గలేదు. 6-3తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆమెకు లైన్‌ నుంచి ప్రతిఘటన ఎదురైనా.. వరుస విజేత షాట్లతో మళ్లీ పుంజుకుంది. 17-11తో ఆధిక్యాన్ని పెంచుకుని ఆరు మ్యాచ్‌ పాయింట్లు సాధించింది. ప్రత్యర్థి నెట్‌ వద్ద చేసిన పొరపాటుతో తొలి అవకాశాన్నే సద్వినియోగం చేసుకుని టైటిల్‌ ఖరారు చేసుకుంది. ఈ విజయంతో సింధు ఈ సీజన్‌లో రెండో టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది. జులైలో జపాన్‌ ఓపెన్‌ గెలిచిన ఆమె.. గత వారం ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచింది. ‘ప్రత్యర్థి ఎవరన్నది ముఖ్యం కాదు. ప్రతి పాయింట్‌పై దృష్టి పెట్టి నా వంద శాతం ప్రదర్శన ఇవ్వాలనుకున్నా. ఆరంభం నుంచే ఆధిక్యం సాధించి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వలేదు’ అని సింధు తెలిపింది. ఈ విజయంతో ఆమెకు 9,200 ర్యాంకింగ్‌ పాయింట్లు లభించాయి. సీజన్‌ ముగింపు వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించే అవకాశాలు మెరుగయ్యాయి.

లక్ష్యసేన్‌ అదరహో

పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో లక్ష్యసేన్‌ ఆరంభంలోనే 8-4తో ఆధిక్యం సాధించాడు. అయితే జొనాటన్‌ క్రిస్టీ పుంజుకుని 9-8తో ముందంజలోకి వెళ్లాడు. ఆ దశలో లక్ష్యసేన్‌ కీలక పాయింట్లు సాధిస్తూ మళ్లీ పట్టు బిగించాడు. స్మాష్‌లు, మాయచేసే షాట్లతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టి 16-10తో ఆధిక్యంలోకి వెళ్లాడు. చివరకు 21-17తో తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో లక్ష్యసేన్‌ మరింత దూకుడుగా ఆడాడు. 6-3తో ఆధిక్యంలోకి వెళ్లి విరామ సమయానికి నాలుగు పాయింట్ల ఆధిక్యాన్ని అందుకున్నాడు. మారిన కోర్టులోనూ అదే జోరు కొనసాగిస్తూ 16-9కు చేరాడు. వీడియో సమీక్షలో క్రిస్టీ చేసిన తప్పిదం నిర్ధారణ కావడంతో లక్ష్యసేన్‌కు 10 మ్యాచ్‌ పాయింట్లు లభించాయి. తొలి అవకాశాన్నే సద్వినియోగం చేసుకుని 21-10తో గేమ్‌తో పాటు టైటిల్‌నూ సొంతం చేసుకున్నాడు. ‘చాలా కాలం తర్వాత టోర్నీ గెలవడం ఆనందంగా ఉంది. తొలి రౌండ్లలో ఎదురైన ఓటములు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి. అయితే ఈ టోర్నీలో మొదటి మ్యాచ్‌ నుంచే బాగా ఆడటం నాలో నమ్మకాన్ని పెంచింది’ అని లక్ష్యసేన్‌ చెప్పాడు. దీపావళి వేడుకల కోసం ఐదు రోజుల పాటు ఇంటికి వెళ్లనున్నట్లు తెలిపాడు. కొత్త ఇంట్లోకి మారుతున్నందున గృహప్రవేశ వేడుక కూడా ఉంటుందని, కుటుంబ సభ్యులతో కలిసి పండగ జరుపుకోనున్నట్లు వెల్లడించాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News