Sunday, October 6, 2024
HomeఆటTeam India : సిరీస్‌పై క‌న్నేసిన భార‌త్‌.. న్యూజిలాండ్‌తో మూడో టీ20 నేడే

Team India : సిరీస్‌పై క‌న్నేసిన భార‌త్‌.. న్యూజిలాండ్‌తో మూడో టీ20 నేడే

Team India : హార్దిక్ పాండ్య నేతృత్వంలోని భార‌త జ‌ట్టు సిరీసే ల‌క్ష్యంగా మూడో టీ20 మ్యాచ్‌లో నేడు(మంగ‌ళ‌వారం న‌వంబ‌ర్‌ 22) బ‌రిలోకి దిగనుంది. నేపియ‌ర్ వేదిక‌గా జ‌రిగే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి సిరీస్ ను 2-0 తో కైవ‌సం చేసుకోవాల‌ని టీమ్ఇండియా భావిస్తోంది. తొలి టీ20 మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కాగా.. రెండో టీ20లో సూర్య‌కుమార్ యాద‌వ్ శ‌త‌కంతో చెల‌రేగ‌డంతో 65 ప‌రుగుల తేడాతో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఈ విజ‌యం ఇచ్చిన ఉత్సాహంతో టీమ్ఇండియా బ‌రిలోకి దిగుతుండ‌గా ఎలాగైనా సిరీస్‌ను స‌మం చేయాల‌ని కివీస్ గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉంది. అయితే.. ఆ జ‌ట్టు.. కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ లేకుండానే బ‌రిలోకి దిగ‌నుంది. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో డాక్ట‌ర్‌ను క‌ల‌వాల్సిన అవ‌స‌రం ఉండ‌డంతో ఈ మ్యాచ్‌కు కేన్ మామ దూరం అయ్యాడు. అత‌డి గైర్హ‌జ‌రీలో సౌథీ జ‌ట్టు ప‌గ్గాలు అందుకోన్నాడు.

- Advertisement -

సూర్యను మిన‌హాయిస్తే..

సూర్య కుమార్ యాద‌వ్ విజృంభిడంతో రెండో టీ20లో భార‌త్ భారీ స్కోర్ చేసింది. అయితే.. అత‌డు మిన‌హా మిగిలిన వారు దారుణంగా విఫ‌లం అయ్యారు. ఓపెన‌ర్ ఇషాన్ కిష‌న్ ఓ మోస్త‌రుగా రాణించాడు. వీరిద్ద‌రితో పాటు మిగిలిన వారు కూడా చెల‌రేగాల‌ని జ‌ట్టు మేనేజ్‌మెంట్ కోరుకుంటోంది. మ‌రీ ముఖ్యంగా యువ వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్ ఫామ్ అందుకోవాల్సి ఉంది. క‌నీసం ఈ మ్యాచ్‌లోనైనా రిష‌బ్ త‌న స్థాయికి త‌గ్గ ఇన్నింగ్స్ ఆడతాడో లేదో మ‌రీ.

రెండో మ్యాచ్‌లో ఆడిన జ‌ట్టుతోనే ఈ మ్యాచ్‌లోనూ భార‌త్ బ‌రిలోకి దిగే అవ‌కాశం ఉంది. అదే జ‌రిగితే మ‌రోసారి సంజు శాంస‌న్‌, ఉమ్రాన్ మాలిక్‌, శుభ్‌మ‌న్ గిల్‌లు బెంచీకే ప‌రిమితం కాక‌త‌ప్ప‌దు. మార్పులు చేయాల‌ని భావిస్తే శ్రేయాస్ స్థానంలో సంజుకు అవ‌కాశం ఇవ్వొచ్చు. కెప్టెన్‌గా త‌న‌దైన ముద్ర వేయాల‌ని భావిస్తున్న హార్ధిక్ తుది జ‌ట్టులో ఎవ‌రికి చోటు ఇస్తాడో మ‌రీ.

ఫిన్ అలెన్‌, గ్లెన్ ఫిలిప్స్‌ల‌పైనే భారం..

కివీస్ జ‌ట్టుకు ప్ర‌ధాన బ‌ల‌మైన కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ జ‌ట్టుకు దూరం కావ‌డంతో బ్యాటింగ్ భారం మొత్తం ఫిన్ అలెన్‌, గ్లెన్ ఫిలిప్స్‌ల‌పైనే ప‌డ‌నుంది. ప్ర‌స్తుతం వీరిద్ద‌రు ఫామ్‌లో ఉండ‌డం ఆ జ‌ట్టుకు ఊర‌ట నిచ్చే అంశం. వీరిద్ద‌రితో పాటు జేమ్స్ నీష‌మ్‌, డేవిడ్ కాన్వే, మిచెల్‌లు రాణిస్తే భార‌త్‌కు క‌ష్టాలు త‌ప్ప‌వు.

నేపియ‌ర్ పిచ్ ఎక్కువ‌గా బ్యాటింగ్‌కు అనుకూలం. భారీ స్కోర్లు న‌మోదు అయ్యే అవ‌కాశం ఉంది. ఈ మ్యాచ్‌కు వ‌రుణుడి ముప్పు పొంచి ఉంది. అయితే..ఆట‌కు పెద్ద‌గా అంత‌రాయం ఉండ‌క‌పోవ‌చ్చున‌ని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News