భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ(BCCI) కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ (Asia Cup 2025) టోర్నీ నుంచి వైదొలుగుతున్నట్లు ఆసియా క్రికెట్ మండలికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే పురుషుల ఆసియా కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఆడే అవకాశాలు లేవని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అలాగే జూన్ నెలలో జరిగే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఆసియా క్రికెట్ మండలికి పాకిస్థాన్ మంత్రి, పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ‘‘పాక్ మంత్రి అధినేతగా ఉన్న క్రికెట్ మండలి నిర్వహించే టోర్నీల్లో టీమ్‌ఇండియా ఆడదు. అది మా దేశ సెంటిమెంట్. అందుకే మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి వైదొలుగుతున్నట్లు ఏసీసీకి సమాచారమిచ్చాం. భవిష్యత్తులో జరగబోయే ఏసీసీ ఈవెంట్లకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించాం. దీనిపై భారత ప్రభుత్వంతో మేం నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం’’ బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే ఆసియా క్రికెట్ మండలికి భారీ ఎదురుదెబ్బ అని చెప్పాలి. టీమిండియా లేకుండా జరిగే టోర్నీకి స్పాన్సర్లు, ప్రసారం చేసేందుకు బ్రాడ్‌కాస్టర్లు కూడా ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశాల్లేవు.