India Pakistan Womens World Cup Match:మహిళల వన్డే వరల్డ్‌కప్ సీజన్‌లో టీమ్‌ఇండియా ఆరంభం మిశ్రమంగా సాగుతోంది. ఇప్పటివరకు రెండు విజయాలు, రెండు ఓటములు నమోదు చేసుకున్న భారత జట్టు ఆదివారం ఇంగ్లాండ్‌తో కీలకమైన పోరులో తలపడేందుకు రెడీ అవుతోంది. ఈ పోరులో విజయం సాధిస్తే భారత్‌కు సెమీస్ అవకాశాలు బలపడతాయి.
భారత్–పాకిస్థాన్ పోరే…
ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో భారత్–పాకిస్థాన్ పోరే ప్రధాన ఆకర్షణగా నిలిచినట్లు వార్తలు వినపడుతున్నాయి. ఈ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు వీక్షించారు. జియో హాట్‌స్టార్, ఐసీసీ విడుదల చేసిన తాజా గణాంకాలు చూస్తే మహిళల క్రికెట్ ప్రజాదరణ కొత్త స్థాయికి చేరిందని తెలుస్తోంది.
Also Read: https://teluguprabha.net/sports-news/test-twenty-new-80-over-cricket-format-launching-in-2026/
భారత్–శ్రీలంక మ్యాచ్ నుంచే వ్యూయర్‌షిప్ గణనీయంగా పెరిగినట్లు వార్తలు వినపడుతున్నాయి. ప్రపంచకప్ తొలి 13 మ్యాచ్‌లను కలిపి సుమారు 60 మిలియన్ల మంది వీక్షించారు. అందులో భారత్–పాకిస్థాన్, భారత్–ఆస్ట్రేలియా మ్యాచ్‌లు ఎక్కువ వ్యూయర్‌షిప్ సాధించాయి. గత ప్రపంచకప్‌తో పోలిస్తే ఈసారి ప్రేక్షకులు మ్యాచ్‌లను నిమిషాలపరంగా 12 రెట్లు ఎక్కువగా వీక్షించారు.
7 బిలియన్ల నిమిషాల వాచ్‌టైమ్..
మహిళల వరల్డ్‌కప్‌లో మొత్తం 7 బిలియన్ల నిమిషాల వాచ్‌టైమ్ నమోదవడం గణనీయమైన విషయం. ఇందులో భారత్–పాకిస్థాన్ పోరు ప్రధాన భాగం. ఈ మ్యాచ్‌ను సుమారు 28.4 మిలియన్ల మంది వీక్షించగా, 1.87 బిలియన్ నిమిషాల వాచ్‌టైమ్ నమోదైంది. ఇది మహిళల క్రికెట్‌లో ఇప్పటివరకు సాధించిన అత్యధిక రికార్డు.
భారత్ ఓటమి…
క్రికెట్ అభిమానుల దృష్టిని ఎక్కువగా ఆకర్షించిన మరో పోరు భారత్–ఆస్ట్రేలియా మ్యాచ్. ఆ మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూసినప్పటికీ, జట్టు ప్రదర్శన ఆకట్టుకుంది. ఫలితంగా ఆ మ్యాచ్‌కు సుమారు 4.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఫ్యాన్స్ సోషల్‌మీడియా వేదికలలో జట్టుకు పెద్ద ఎత్తున మద్దతు తెలపడం కూడా గమనార్హం.
ప్రస్తుతం లీగ్ దశలో భారత్ ఇంకా మూడు కీలకమైన మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో తలపడే ఈ మ్యాచ్‌ల ఫలితాలపై భారత జట్టు సెమీస్ ఆశలు ఆధారపడి ఉన్నాయి. ప్రతి పోరులో గెలుపే భారత్‌కు మార్గం.క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నదేమిటంటే, ఈ వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఆడే ప్రతి మ్యాచ్ ప్రేక్షకుల ఆసక్తిని మరింత పెంచుతుంది.
మహిళల క్రికెట్ మునుపెన్నడూ లేనంత స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. మ్యాచ్‌లలో పోటీ స్థాయి పెరగడం, స్టార్ ప్లేయర్ల ప్రదర్శన, టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో సులభంగా వీక్షించే అవకాశాలు ఇవన్నీ కలిపి రికార్డులు సృష్టిస్తున్నాయని వారు పేర్కొంటున్నారు.
జియో హాట్‌స్టార్ అధికారులు కూడా తమ ప్లాట్‌ఫార్మ్‌లో మహిళల వరల్డ్‌కప్ వీక్షణ భారీ స్థాయిలో పెరిగిందని తెలిపారు. పురుషుల మ్యాచ్‌లకు సమానంగా ఇప్పుడు మహిళల మ్యాచ్‌లకూ అభిమానులు సమయం కేటాయిస్తున్నారని పేర్కొన్నారు.భారత్ జట్టు ప్రస్తుత ప్రదర్శనపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
బ్యాటింగ్‌లో స్థిరత్వం..
బౌలింగ్, ఫీల్డింగ్‌లో జట్టు బలంగా ఉన్నప్పటికీ, బ్యాటింగ్‌లో స్థిరత్వం కావాలని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. రాబోయే ఇంగ్లాండ్ పోరులో భారత్ గెలవాలంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌వుమెన్ నుంచి మంచి ఇన్నింగ్స్ అవసరమని వారు అభిప్రాయపడ్డారు.


