ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా.. తొలి సెమీఫైనల్‌లో భారత్-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. మంగళవారం ఈ మెగా మ్యాచ్ జరగనుంది. ఐసీసీ టోర్నమెంట్‌లో ఈ రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇప్పుడు చూద్దాం. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐసీసీ టోర్నమెంట్ సెమీఫైనల్‌లో మొదటి సారి 2007లో తలపడ్డాయి. T20 వరల్డ్ కప్ మొదటి ఎడిషన్‌లో డర్బన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 15 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చేరింది.
అంతేకాదు.. ఈ వరల్డ్ కప్ టీమిండియా సొంతం చేసుకుంది. ఆ తర్వాత 2015లో జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను 95 పరుగుల తేడాతో ఓడించింది. సిడ్నీలో జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 328 పరుగులు చేయగా, భారత్ కేవలం 233 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ భారీ ఓటమిని ఎదుర్కొని టోర్నీ నుండి విశ్రమించింది.
ఇప్పుడు మూడవ సారి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్‌లో తలపడనున్నారు. ఈసారి మ్యాచ్ యూఏఈలోని దుబాయ్ వేదికగా జరగనుంది. ఇక్కడ భారత్ తొలి మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. మరోవైపు ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో దుబాయ్‌లో ఆడలేదు. కానీ ఆ జట్టు కూడా అజేయంగా సెమీస్‌కు చేరుకుంది. అంటే ఈసారి పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో మొత్తం 8 సార్లు భారత్, ఆస్ట్రేలియా తలపడ్డాయి. ఇందులో ఇరు జట్లు నాలుగు మ్యాచ్‌ల చొప్పున గెలిచాయి. అంటే, ప్రస్తుతం ఈ జట్ల మధ్య రికార్డ్ సమంగా ఉంది.
ప్రస్తుత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత జట్టు మంచి ఫామ్‌లో ఉంది.. దీంతో అభిమానులు జట్టుపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. జట్టు ప్రదర్శన కూడా అద్భుతంగా ఉండటంతో.. సెమీస్‌లో టీమిండియా విజయం సాధించి ఫైనల్‌కి దూసుకు పోతుందని అంతా భావిస్తున్నారు. మరి సెమీఫైనల్‌లో ఎవరు గెలుస్తారు.. టీమిండియా మరోసారి మ్యాజిక్ చేస్తుందా.. లేక ఆస్ట్రేలియా గెలుస్తుందా తెలియాలంటే మంగళవారం వరకు ఆగాల్సిందే.