ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)లో భాగంగా దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టును 49.4 ఓవర్లలో 228 పరుగులకు భారత్ ఆలౌట్ చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా టాపార్డర్ విఫలమైనప్పటికీ, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్లు రాణించడంతో గౌరవప్రదమైన స్కోర్ చేసింది. తౌహిద్ హృదయ్ సెంచరీ (100)తో అదరగొట్టగా.. జాకెర్ అలీ కూడా అర్ధ సెంచరీ (68)తో ఆకట్టుకున్నాడు. ఇక భారత బౌలర్లలో మహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా మూడు వికెట్లు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు. 229 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా దూకుడుగా ఆడుతోంది.
ఇక ఈ మ్యాచ్‌లో భారత బౌలర్ షమీ అరుదైన రికార్డు అందుకున్నాడు. మొత్తం 5126 బంతుల్లో 200 వికెట్లు అందుకున్న తొలి ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఆసీస్ బౌలర్ స్టార్క్ 200 వికెట్లు తీసుకోవడానికి 5240 బంతులు వేయాల్సి వచ్చింది. కానీ అతి తక్కువ మ్యాచుల్లో స్టార్క్ ఆ రికార్డును అందుకున్నాడు. ఇక వైట్‌బాల్ టోర్నీల్లో 72 వికెట్లతో టాప్ ఇండియన్ బౌలర్‌గా షమీ నిలిచాడు. ఈ క్రమంలో అతను జహీర్ ఖాన్(71) రికార్డ్‌ను అధిగమించాడు. జస్‌ప్రీత్ బుమ్రా (68 వికెట్లు), రవీంద్ర జడేజా(65), రవిచంద్రన్ అశ్విన్(59) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.