Wednesday, February 5, 2025
HomeఆటInd vs Eng: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే..!

Ind vs Eng: ఇంగ్లండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్ ఇదే..!

ఇంగ్లండ్ తో సొంత గడ్డపై జరిగిన టీ20 సిరీస్ ను సొంతం చేసుకున్న టీమిండియా ఫుల్ జోష్ లో ఉంది. ఇదే ఉత్సాహంతో వన్డే వార్ కు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 6 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి వన్డే గురువారం నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఈ నెలాఖరులో పాకిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రిపరేషన్‌గా ఈ సిరీస్ ఉపయోగపడనుంది.

- Advertisement -

బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ అనంతరం.. టీమిండియా కీలక ఆటగాళ్లు కోహ్లీ, రోహిత్, శుబ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లు మైదానంలోకి అడుగు పెట్టనున్నారు. దీంతో వీరికి ఈ సిరీస్ కీలకం కానుంది. 2023 వన్డే వరల్డ్ కప్‌ తర్వాత టీమ్ ఇండియా కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడింది. భారత్ చివరిగా 2024 ఆగస్టులో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను 2-0తో ఓడిపోయింది. గత 27 సంవత్సరాలలో లంకపై సిరీస్ ఓడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత వన్డేలు ఆడుతున్నా సరే, టీమ్ ఇండియాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లు సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. టీ20 సిరీస్ లో బౌలింగ్ బ్యాటింగ్ లో అదరగొట్టిన హార్దిక్ పాండ్యా వన్డేల్లో కూడా రాణిస్తే టీమిండియాకు ఢోకా ఉండదు. ఇటు రవీంద్ర జడేజా గత కొంత కాలంగా వికెట్లు తీయడంలో వెనకబడ్డాడు.. ఈ మ్యాచ్ లో మరోసారి ఫామ్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ లు పరవాలేదనిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం అందరి దృష్టి టీమిండియా స్టార్ పేసర్ షమీపైనే ఉంది. గాయం నుంచి కోలుకున్న తర్వాత టీ20 సిరీస్ లో ఆడిన షమీ.. అనుకున్న స్థాయిలో రాణించలేదు. వన్డే సిరీస్ లో ఎలా ఆడతాడో చూడాలి.

ఇక హెడ్ టు హెడ్ రికార్డుల్లో కూడా టీమిండియాదే పైచేయి. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తో 107 వన్డేలు ఆడిన భారత్.. వాటిలో 58 మ్యాచుల్లో విజయం సాధించింది. ఇక ఇంగ్లండ్ 44 మ్యాచుల్లో గెలిచింది. ఈ రెండు టీమ్స్ మధ్య ఇండియాలో 52 వన్డేలు జరిగాయి, వీటిలో మెన్ ఇన్ బ్లూ 34 మ్యాచ్‌లు గెలిచింది. ఇక నాగ్‌పూర్ పిచ్ విషయానికి వస్తే ఇక్కడ ఆరేళ్ల తర్వాత వన్డే మ్యాచ్ జరుగుతోంది. చివరిసారిగా ఈ గ్రౌండ్‌లో భారత్ ఆడిన వన్డేలో, విరాట్ కోహ్లీ సెంచరీ చేసి, మ్యాచ్‌ను గెలిపించాడు.

భారత్, ఇంగ్లాండ్ మొదటిసారి నాగ్‌పూర్‌లో తలపడనున్నాయి. ఇక్కడ ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. గ్రౌండ్‌లో ఆడిన తొమ్మిది వన్డేల్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 288 పరుగులు. 2009లో ఆస్ట్రేలియాపై ఆడిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా 354 పరుగులు చేసింది. ఇది ఇప్పటికీ నాగ్‌పూర్ స్టేడియంలో హైయెస్ట్ స్కోర్. 2009లో ఆసీస్‌పై ఎంఎస్ ధోని నేతృత్వంలోని టీమ్ ఇండియా, 351 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. నాగ్‌పూర్‌లో వర్షం పడే అవకాశం లేదు. అత్యధిక ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్టంగా 18 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉండవచ్చు, వాతావరణం పొడిగా, వేడి మధ్యస్తంగా ఉంటుంది. రేపు మధ్యాహ్నం 1.30కి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. మరి ఈ మ్యాచ్ లో టీమిండియా ఎలా ఆడుతుందో చూడాలి.

ప్లేయింగ్ ఎలెవన్

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.

ఇంగ్లాండ్: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జామీ ఓవర్‌స్టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News