India vs New Zealand T20I Highlights 2026 : క్రికెట్ అభిమానుల కేరింతలు.. పరుగుల వరద.. సిక్సర్ల హోరు.. వెరసి తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియం ఒక అద్భుత ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమ్ ఇండియా తన అసలైన ప్రతాపాన్ని చూపించింది. కివీస్ బౌలర్లను ‘ముప్పుతిప్పలు’ పెడుతూ భారత బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆఖరి పోరును భారత్ ఏకపక్షంగా ముగించి, సిరీస్‌ను 4-1తో ముద్దాడింది.
పరుగుల ప్రభంజనం: కిషన్ సెంచరీ : శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇన్నింగ్స్ ఆద్యంతం భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.
కిషన్ ‘శతక’ గర్జన: ఓపెనర్ ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో ‘విశ్వరూపం’ ప్రదర్శించాడు. కివీస్ బౌలర్ల బంతులను స్టేడియం నలుమూలలకూ తరలిస్తూ కేవలం 52 బంతుల్లోనే 103 పరుగులు సాధించి సెంచరీతో మెరిశాడు. ఇషాన్ ఇన్నింగ్స్ టీమ్ ఇండియాకు భారీ పునాది వేసింది.
సూర్య, హార్దిక్ మెరుపులు: ఇషాన్ అవుటైన తర్వాత మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. కేవలం 28 బంతుల్లోనే 63 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన మార్కు షాట్లతో 42 పరుగులు జోడించడంతో భారత్ చరిత్రలోనే అత్యధిక టీ20 స్కోర్లలో ఒకటి నమోదయ్యింది.
కివీస్ విలవిల: 272 పరుగుల కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు, భారత బౌలర్ల ధాటికి తలవంచక తప్పలేదు. “గోరుచుట్టుపై రోకలిపోటు” అన్నట్లుగా ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయిన కివీస్, ఎక్కడా కోలుకోలేకపోయింది. గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్‌మన్ కాసేపు ప్రతిఘటించినప్పటికీ, రన్ రేట్ పెరుగుతుండటంతో వికెట్లు పారేసుకున్నారు. భారత బౌలర్లు కచ్చితమైన లెంగ్త్ తో బౌలింగ్ చేసి కివీస్‌ను 225 పరుగులకే కట్టడి చేశారు. దీంతో భారత్ 46 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ప్రపంచకప్ ముంగిట ‘శుభ’ సంకేతం : ఈ విజయంతో భారత్ సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. విశాఖపట్నంలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో తగిలిన ఎదురుదెబ్బ నుంచి కోలుకుని, తిరిగి విజయపథంలోకి రావడం జట్టు మానసిక బలాన్ని సూచిస్తోంది.

