IND vs SA 3rd T20 Highlights: ధర్మశాలలో సౌతాఫ్రికాతో జరిగిన మూడో టీ20లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్ లో తొలిసారి భారత బౌలర్లు జూలు విదిల్చారు. సమిష్టిగా బౌలింగ్ చేసి మన జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో జస్‌ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ స్థానంలో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్‌లకు చోటు కల్పించారు.
చెలరేగిన భారత బౌలర్లు…
టీమ్ ఇండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత బౌలర్లు మ్యాచ్ ప్రారంభం నుంచే ప్రోటీస్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. గత మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన డికాక్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔట్యయాడు. మరో ఓపెనర్ హెండ్రిక్ డకౌట్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న కెప్టెన్ మార్కక్రమ్ అద్భుతంగా ఆడాడు. బ్రెవిస్, స్టబ్స్, బోష్ స్వల్ప స్కోర్లుకే వెనుదిరిగినా పెరీరా(20) అండతో మార్కక్రమ్ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. అతడు 46 బంతుల్లో ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 61 పరుగులు చేసి ఎనిమిదో వికెట్ గా వెనుదిరిగాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 117 పరుగులకే ఆలౌట్ అయింది. వరుణ్ చక్రవర్తి, ఆర్షదీప్, కుల్దీప్, హర్షిత్ రాణా రెండేసి వికెట్లు తీశారు. ఒక్క వికెట్ తీయడం ద్వారా టీ20ల్లో 100 వికెట్లు, 100 సిక్సర్లు కొట్టిన తొలి టీమ్ ఇండియా ఆటగాడిగా పాండ్యా చరిత్ర సృష్టించాడు.
Also Read: Tilak varma – నేపాలీ క్రికెటర్ తో తిలక్ ప్రేమాయాణం.. ఇందులో నిజమెంత?
అభిషేక్ మెరుపు ఆరంభం..
ప్రోటీస్ ఇచ్చిన 118 పరుగుల టార్గెట్ ను భారత జట్టు సునాయసంగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభమాన్ గిల్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా అభిషేక్ సౌతాఫ్రికా బౌలర్లను ఊచకోత కోశాడు. అతడు కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 35 పరుగులు చేసి ఔటయ్యాడు. గిల్ తో కలిసి అతడు తొలి వికెట్ కు 60 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్ తో కలిసి ఇన్నింగ్స్ ను నడిపించాడు గిల్. 92 పరుగుల వద్ద టీమ్ ఇండియా తన రెండో వికెట్ ను కోల్పోయింది. భారత వైస్ కెప్టెన్ 28 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత క్రీజులో వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే శివమ్ ధూబేతో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు తిలక్(26). భారత్ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

