India win in Ahmedabad Test: అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో కరేబియన్ దేశాన్ని మట్టి కల్పించింది. వెస్టిండీస్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో కేవలం146 రన్స్‌కే ఆలౌటైంది. మ్యాచ్ ప్రారంభం నుంచి భారత్ ఆధిపత్యం చెలాయించడంతో కేవలం మూడు రోజుల్లోనే తొలి టెస్ట్ ముగిసింది.
టీ బ్రేక్ ముందే ముగిసిన వెస్టిండీస్ ఇన్నింగ్స్: ఆట రెండో రోజు బ్యాటింగ్ లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత్.. మూడో రోజు ఆట ప్రారంభానికి ముందే డిక్లేర్ చేసింది. ఓవర్‌నైట్ స్కోర్ 448/5 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడంతో.. వెస్టిండీస్ ముందు 286 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అనంతరం తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కరేబియన్ బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. లంచ్‌కు ముందే వెస్టిండీస్ అయిదు వికెట్లు కోల్పోయారు. లంచ్ సమయానికి కరేబియన్ జట్టు స్కోర్ కేవలం 66/5గా ఉంది. లంచ్ అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ జట్టు.. భారత్ బౌలింగ్ దాటికి కనీసం టీ బ్రేక్ వరకు కూడా నిలవలేకపోయింది.
సమిష్టి విజయం: వెస్టిండీస్ జట్టు తన తొలి వికెట్‌ను 12 పరుగుల వద్ద చంద్రపాల్ రూపంలో కోల్పోయింది. సిరాజ్ బౌలింగ్‌లో చంద్రపాల్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించగా నితీశ్ రెడ్డి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. సిరాజ్ ఇచ్చిన శుభారంభాన్ని మిగతా బౌలర్లు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్ చకచకా వికెట్లు కూల్చారు.
వెస్టిండీస్ బ్యాటర్లలో అలిక్ అథనేజ్ (38; 74 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. జస్టిన్ గ్రీవ్స్(25; 52 బంతుల్లో, 4 ఫోర్లు), జాన్ క్యాంప్‌బెల్ (14; 32 బంతుల్లో, 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా కరేబియన్ బ్యాటర్లంతా ఘోరంగా విఫలమయ్యారు. టీమ్‌ఇండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 4, మహ్మద్ సిరాజ్ 3, కుల్‌దీప్ యాదవ్ 2, వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ తీసుకున్నారు.


