నెదర్లాండ్స్(తెలుగుప్రభ): స్వాతంత్య్ర దినోత్సవ వేళ భారత హాకీ జట్టు ప్రపంచకప్ వేటను ఘన విజయంతో ఆరంభించింది. పూల్-డిలో శనివారం జరిగిన మ్యాచ్‌లో వేల్స్‌ను 3–1తో ఓడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచగా.. సంజయ్ మరో గోల్ కొట్టాడు. తొలి మూడు క్వార్టర్లలో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ 3–0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే చివరి క్వార్టర్‌లో వేల్స్ ఓ గోల్ చేయడంతో భారత్ క్లీన్‌షీట్ కోల్పోయింది. సుమారు 10 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న వాగెనర్ స్టేడియంలో భారత అభిమానుల హర్షధ్వానాల మధ్య మ్యాచ్ సాగింది. 1975లో ప్రపంచకప్‌లో స్వర్ణం సాధించిన తర్వాత మరో పతకం కోసం ఎదురుచూస్తున్న భారత్.. ఈసారి విజయంతో ఖాతా తెరిచింది. మ్యాచ్ ఆరంభంలో వేల్స్ దూకుడుగా ఆడింది. రెండో నిమిషంలోనే భారత సర్కిల్‌లోకి చొచ్చుకొచ్చిన ఆ జట్టు.. జాక్ ప్రిచర్డ్ ద్వారా గోల్‌కు ప్రయత్నించింది. ఫ్రెడ్ న్యూబోల్డ్ పాస్‌ను అందుకున్న ప్రిచర్డ్ షాట్‌ను గోల్‌కీపర్ సూరజ్ కర్కేరా అడ్డుకున్నాడు. రీబౌండ్‌పై న్యూబోల్డ్ చేసిన ప్రయత్నం బార్‌పై నుంచి వెళ్లింది. ఐదో నిమిషంలోనూ న్యూబోల్డ్ మరోసారి పరీక్ష పెట్టినా కర్కేరా సమర్థంగా నిలిచాడు.
సంజయ్ మెరుపు డ్రాగ్‌ఫ్లిక్..
వేల్స్ దాడికి భారత్ కౌంటర్ అటాక్‌తో బదులిచ్చింది. ఏడో నిమిషంలో హార్దిక్ సింగ్ పెనాల్టీ కార్నర్ సాధించాడు. హర్మన్‌ప్రీత్ మైదానంలో లేకపోవడంతో సంజయ్ తొలి ప్రయత్నం విఫలమైంది. బంతి వేల్స్ తొలి రషర్ కాలికి తగలడంతో భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించింది. ఈసారి సంజయ్ అవకాశం వదల్లేదు. ఎనిమిదో నిమిషంలో శక్తివంతమైన డైరెక్ట్ డ్రాగ్‌ఫ్లిక్‌తో బంతిని గోల్‌లోకి పంపి భారత్‌ను 1–0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 11వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ తనదైన శైలిలో బలమైన డ్రాగ్‌ఫ్లిక్‌తో గోల్‌గా మలిచాడు. దీంతో భారత్ ఆధిక్యం 2–0కు చేరింది. వేల్స్ ప్రతిదాడులకు దిగినా హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని భారత రక్షణ గోడను ఛేదించలేకపోయింది. తొలి క్వార్టర్ ముగిసేలోపు భారత్‌కు మరో పెనాల్టీ కార్నర్ లభించినా హర్మన్‌ప్రీత్ ఫ్లిక్ లక్ష్యాన్ని తప్పింది. రెండో క్వార్టర్ ఆరంభంలోనే 417 అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవమున్న మన్‌ప్రీత్ సింగ్ మరో పెనాల్టీ కార్నర్ సంపాదించాడు. అయితే హర్మన్‌ప్రీత్ తొలి ప్రయత్నాన్ని మన్‌ప్రీత్ సరిగ్గా ట్రాప్ చేయలేకపోయాడు. రీబౌండ్‌ను మన్‌దీప్ సింగ్ కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 19వ నిమిషంలో వేల్స్‌కు గోల్ చేసే అవకాశం వచ్చింది. సుదూర పాస్‌ను అందుకున్న ప్రిచర్డ్ గోల్ వైపు దూసుకెళ్లగా.. గోల్‌కీపర్ మొహిత్ హెచ్‌ఎస్ ముందుకొచ్చి అడ్డుకున్నాడు. ప్రిచర్డ్ కొట్టిన బంతి పోస్ట్‌కు తగిలి వెనక్కి వచ్చింది. మిగతా సమయంలో భారత్ ఆధిపత్యం కొనసాగించినా మరో గోల్ రాలేదు. దీంతో తొలి అర్ధభాగం 2–0తో ముగిసింది.
మళ్లీ హర్మన్ మ్యాజిక్..
మూడో క్వార్టర్‌లోనూ భారత్ అదే జోరును కొనసాగించింది. వేల్స్‌పై ఒత్తిడి పెంచుతూ 42వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ సాధించింది. నిమిషం తర్వాత హర్మన్‌ప్రీత్ మరోసారి తన సత్తా చాటాడు. ఎడమ వైపు నుంచి తక్కువ ఎత్తులో శక్తివంతమైన ఫ్లిక్‌తో బంతిని గోల్‌లోకి పంపి భారత్ ఆధిక్యాన్ని 3–0కు పెంచాడు. అద్భుత ప్రదర్శన చేసిన హర్మన్‌ప్రీత్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
చివర్లో చేజారిన క్లీన్‌షీట్..
54వ నిమిషంలో వేల్స్‌కు తొలి పెనాల్టీ కార్నర్ లభించింది. గారెత్ ఫర్లాంగ్ కొట్టిన బలమైన షాట్‌ను గోల్‌కీపర్ మొహిత్ అద్భుతంగా అడ్డుకున్నాడు. అయితే 56వ నిమిషంలో వేల్స్ ఎట్టకేలకు ఖాతా తెరిచింది. భారత గోల్ ముందు ఏర్పడిన గందరగోళంలో బంతి నెట్‌లోకి వెళ్లింది. గోల్ లైన్‌పై బంతిని కొట్టే సమయంలో బ్యాక్‌స్టిక్ నిబంధన ఉల్లంఘన జరిగిందా? పెనాల్టీ స్ట్రోక్ ఇవ్వాలా? అనే అంశంపై అంపైర్ వీడియో రిఫరల్ కోరాడు. సమీక్షలో నిబంధన ఉల్లంఘనకు ముందే బంతి గోల్ లైన్ దాటినట్లు తేలడంతో వేల్స్ గోల్‌ను ఖరారు చేశారు.
గోల్ తేడా కీలకం..
కొత్త ప్రపంచకప్ ఫార్మాట్‌లో గోల్స్ తేడాకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో క్లీన్‌షీట్‌తో పాటు మరింత భారీ విజయం సాధించి ఉంటే భారత్‌కు అదనపు ప్రయోజనం ఉండేది. చివర్లో రక్షణలో చేసిన తప్పిదాలు, గోల్ సమర్పించుకోవడంపై కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ దృష్టి పెట్టాల్సి ఉంది. రెండో ప్రపంచకప్ ఆడుతున్న వేల్స్ చివరి వరకు పోరాడినా భారత జట్టు నాణ్యత ముందు నిలవలేకపోయింది. మూడు పాయింట్లు సాధించిన భారత్ ప్రపంచకప్ ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించింది. తదుపరి మ్యాచ్‌లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌తో భారత్ తలపడనుంది.
అవకాశాలు సృష్టించడమే లక్ష్యం..
‘మేం చాలా బాగా ఆడాం. ప్రతి మ్యాచ్‌లో అవకాశాలు సృష్టించి గోల్స్ చేయాలన్నదే మా లక్ష్యం. గోల్ ఎవరు చేశారు? మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అన్నది ముఖ్యం కాదు. జట్టు గోల్స్ సాధించడమే ప్రధాన విషయం. అదే ఆలోచనతో మేం మైదానంలోకి దిగాం’’ అని హర్మన్‌ప్రీత్ చెప్పాడు. ‘మంచి విజయంతో టోర్నీని ప్రారంభించడం ముఖ్యమే. 3–1తో గెలిచి మూడు పాయింట్లు సాధించాం. ఇది మంచి ఫలితం’ అని పేర్కొన్నాడు. చివరి నిమిషాల్లో వేల్స్ గోల్ చేయడంతో భారత్ క్లీన్‌షీట్‌ను కోల్పోయింది. దీనిపై హర్మన్‌ప్రీత్ స్పందిస్తూ.. ప్రత్యర్థి కూడా బాగా ఆడిందని, తమ తప్పుల నుంచి నేర్చుకొని తదుపరి మ్యాచ్‌ల్లో వాటిని పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పాడు. మా ఫార్వర్డ్ లైన్ బాగా ఆడి అనేక పెనాల్టీ కార్నర్లు సంపాదించింది. ఫీల్డ్ గోల్స్ చేసినా, పెనాల్టీ కార్నర్లు సృష్టించినా జట్టుకు గోల్స్ రావడమే ముఖ్యమని స్పష్టం చేశాడు.
పతకం సాధిస్తాం..
ప్రపంచకప్‌కు ముందు జట్టు ప్రదర్శనలో హెచ్చుతగ్గులు కనిపించినా.. అవి ఆటలో సహజమేనని హర్మన్‌ప్రీత్ అన్నాడు. ప్రస్తుతం తమ పూర్తి దృష్టి ప్రపంచకప్‌పైనే ఉందని, జట్టు మంచి ఫామ్‌లో ఉందని హర్మన్ పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం మా దృష్టి మొత్తం ప్రపంచకప్‌పైనే ఉంది. మేం మంచి ఫామ్‌లో ఉన్నాం. పూర్తి సన్నద్ధతతో, ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. ఈ టోర్నీలో పతకం సాధించగలమన్న నమ్మకం మాకుంది’ అని హర్మన్‌ప్రీత్ ధీమా వ్యక్తం చేశాడు.

