Indian Women’s Cricket Team World Cup Victory : దశాబ్దాల నిరీక్షణ ఫలించింది. కోట్లాది మంది అభిమానుల ఆకాంక్షలు నెరవేరాయి. భారత మహిళల క్రికెట్ జట్టు విశ్వవేదికపై సరికొత్త చరిత్రను లిఖించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి, తొలిసారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది.
విజయం వెనుక అద్భుత ప్రదర్శన : ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ తుది సమరంలో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. యువ ఓపెనర్ షఫాలీ వర్మ (87 పరుగులు) ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (58 పరుగులు) అద్భుతమైన అర్ధ శతకాలతో భారత ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచారు. స్మృతి మంధాన (45) కూడా కీలకమైన పరుగులు జోడించింది. వీరిద్దరి భాగస్వామ్యం జట్టుకు పటిష్టమైన పునాది వేసింది. అనంతరం, 299 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు, భారత బౌలర్ల ధాటికి తలవంచింది.
దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ (101) శతకంతో ఒంటరి పోరాటం చేసినప్పటికీ, ఇతర బ్యాటర్ల నుండి ఆశించినంత సహకారం లభించలేదు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 5 వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించగా, షఫాలీ వర్మ రెండు వికెట్లు, తెలుగు తేజం శ్రీ చరణి ఒక వికెట్ పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌట్ అయింది.
చారిత్రక క్షణాలు, చెరగని ముద్ర : ఈ విజయంతో భారత మహిళల జట్టు, ప్రపంచ కప్ గెలిచిన నూతన విజేతగా అవతరించింది. గతంలో రెండుసార్లు ఫైనల్స్‌కు చేరినప్పటికీ, టైటిల్‌ను గెలవలేకపోయిన భారత్, ఈసారి సొంతగడ్డపై ఆ కలను సాకారం చేసుకుంది. ఈ చారిత్రక విజయం, దేశంలోని భవిష్యత్ మహిళా క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదు, భారత మహిళా క్రికెట్ శక్తికి, వారి అంకితభావానికి నిలువుటద్దం.


