Saturday, November 15, 2025
HomeఆటWWC-BCCI: మహిళల జట్టుకు బీసీసీఐ...51 కోట్ల నజరానా

WWC-BCCI: మహిళల జట్టుకు బీసీసీఐ…51 కోట్ల నజరానా

India Women Cricket- World Cup 2025:భారత మహిళా క్రికెట్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘనతను టీమ్‌ ఇండియా అందుకుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత మహిళలు అద్భుత ప్రదర్శనతో విజేతలుగా నిలిచి దేశాన్ని గర్వపడేలా చేశారు. 47 ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్షణం ఇది. ఇంతకాలం కలగా ఉన్న ప్రపంచకప్‌ ట్రోఫీని హర్మన్‌ప్రీత్ కౌర్‌ సేన ఎట్టకేలకు భారత్‌కు అందించింది.

- Advertisement -

సఫారీ జట్టును చిత్తు..

మిథాలీ రాజ్‌ నాయకత్వంలో గతంలో రెండు సార్లు ఫైనల్‌ దశకు చేరుకున్నా, అదృష్టం అండగాలేదు. కానీ ఈసారి జట్టు ఒక్క పొరపాటు కూడా చేయకుండా సఫారీ జట్టును చిత్తుచేసింది. మైదానంలో చూపిన జట్టు సమన్వయం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ చూసి అభిమానులు మంత్రముగ్ధులయ్యారు. భారత మహిళల ఈ అద్భుత విజయానికి ప్రపంచవ్యాప్తంగా నుంచి శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది.

Also Read:https://teluguprabha.net/sports-news/india-vs-south-africa-women-world-cup-final-five-key-factors/

రూ.39 కోట్ల ప్రైజ్‌మనీ..

ఫైనల్‌ మ్యాచ్‌ అనంతరం ఐసీసీ ప్రకటించిన వివరాల ప్రకారం భారత జట్టుకు రూ.39 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది. ఇది మహిళా క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు అందిన అత్యధిక మొత్తంగా నిలిచింది. అంతేకాక, భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా చరిత్రలో తొలిసారి ఇంత పెద్ద మొత్తంలో బహుమతి ప్రకటించింది. బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా వెల్లడించిన ప్రకారం, బోర్డు మొత్తం రూ.51 కోట్లు జట్టుకు అందజేయనుంది.

మహిళా జట్టు విజయం..

ఈ మొత్తం ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బందిలో సమానంగా పంచిపెట్టనున్నారు. దేవజిత్‌ సైకియా తన ప్రకటనలో 1983లో కపిల్‌దేవ్‌ సేన మొదటిసారి పురుషుల ప్రపంచకప్‌ను గెలిచిన సందర్భాన్ని ప్రస్తావించారు. ఆ విజయంతో దేశంలో క్రికెట్‌కి విపరీతమైన ఆదరణ పెరిగిందని, ఇప్పుడు మహిళా జట్టు విజయం కూడా అలాంటి మలుపును తీసుకువస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం భవిష్యత్తులో ఇంకా ఎంతో మంది యువతులను క్రికెట్‌ వైపు తీసుకుని వచ్చే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశానికి గర్వకారణం..

ఇక ఐసీసీ ఛైర్మన్‌ జైషా కూడా భారత మహిళా జట్టు విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తన సోషల్‌ మీడియాలో జైషా ఇలా పేర్కొన్నారు. భారత మహిళా జట్టు మొదటిసారి ప్రపంచకప్‌ను గెలవడం దేశానికి గర్వకారణం. హర్మన్‌ప్రీత్‌ నాయకత్వం, జట్టు ధైర్యసాహసాలు, ఆటగాళ్ల నిబద్ధత దేశానికి స్ఫూర్తి అని తెలిపారు. మహిళా క్రికెట్‌ అభివృద్ధి కోసం బీసీసీఐ తీసుకున్న విధాన నిర్ణయాలు ఈ విజయానికి బలమైన పునాదిగా నిలిచాయని అన్నారు.

పురుష క్రికెటర్లతో సమాన వేతనాలు..

అతను గుర్తుచేసిన కీలక అంశాల్లో మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమాన వేతనాలు ఇవ్వడం, కోచింగ్‌ వ్యవస్థను బలోపేతం చేయడం, పెట్టుబడులను గణనీయంగా పెంచడం వంటివి ఉన్నాయి. ఈ మార్పులు మహిళా క్రికెట్‌ను కొత్త దశకు తీసుకెళ్లాయని ఆయన అభిప్రాయపడ్డారు.

భావితరాలకు స్ఫూర్తిగా..

రిలయన్స్‌ ఫౌండేషన్‌ చైర్‌పర్సన్‌ నీతా అంబానీ కూడా భారత జట్టు ప్రదర్శనపై స్పందించారు. ఆదివారం రాత్రి ఆత్మవిశ్వాసంతో, సమన్వయంతో ఆడిన అమ్మాయిలు దేశానికి గర్వకారణమని ఆమె పేర్కొన్నారు. మహిళా జట్టు చూపిన నిబద్ధత, ఆటతీరు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు. దేశం మొత్తానికి ఈ విజయం ఆనందాన్ని పంచిందని, భవిష్యత్తులో మహిళా క్రికెట్‌ మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయని తెలిపారు.

మరోవైపు, క్రీడాభిమానులు సోషల్‌ మీడియాలో హర్షధ్వానాలు చేస్తున్నారు. హర్మన్‌ప్రీత్‌, స్మృతి మంధానా, షఫాలీ వర్మ, రేణుకా సింగ్‌ వంటి ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనను దేశం పొగడ్తలతో ముంచెత్తుతోంది. ముఖ్యంగా ఫైనల్‌లో హర్మన్‌ప్రీత్‌ ఆడిన కప్తానీ ఇన్నింగ్స్‌ అందరినీ ఆకట్టుకుంది. మంధానా సునాయాసంగా చేసిన ఫీల్డింగ్‌ మరియు రేణుకా అందించిన కీలక వికెట్లు మ్యాచ్‌ తీరును మార్చేశాయి.

Also Read: https://teluguprabha.net/sports-news/india-aims-to-bounce-back-in-third-t20-against-australia/

విజయంతో దేశమంతా సంబరాల్లో మునిగిపోయింది. ఢిల్లీలో, ముంబైలో, హైదరాబాద్‌లో అభిమానులు జాతీయ జెండాలతో వీధుల్లోకి వచ్చి విజయాన్ని జరుపుకున్నారు. భారత ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రులు, క్రీడా ప్రముఖులు అందరూ మహిళా జట్టును అభినందించారు.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా పేర్కొన్నట్లుగా, జైషా బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత (2019–2024) మహిళా క్రికెట్‌కు ప్రాధాన్యత పెరిగింది. ఆటగాళ్లకు అవసరమైన సౌకర్యాలు, ప్రొఫెషనల్‌ సపోర్ట్‌ అందించడంలో బీసీసీఐ ముందడుగు వేసింది. అదే దారిలో ఇప్పుడు జట్టు ప్రపంచకప్‌ను గెలిచి ఆ శ్రమకు ఫలితాన్ని చూపించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad