IND vs AUS ODI 3rd RO-KO: సిడ్నీ వేదికగా మూడో, ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది. కేవలం 38.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనతో ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇస్తూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుత శతకంతో చెలరేగాడు. విరాట్ కోహ్లీ తనదైన శైలిలో హాఫ్ సెంచరీ చేశాడు. ఈ రికార్డుతో కోహ్లీ.. వన్డేలో రెండో అత్యధిక పరుగుల వీరుడుగా నిలిచాడు.
Also Read: https://teluguprabha.net/sports-news/virat-kohli-super-catch-against-australia/
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా పెర్త్, అడిలైడ్‌లో రెండు వన్డేల్లో విజయం సాధించిన ఆస్ట్రేలియా.. మూడో వన్డేలో భాగంగా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్దేశ 50 ఓవర్లలో 46.4 ఓవర్లకు 236 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ టీమిండియా చెలరేగిపోయింది. వరుసగా వికెట్లు తీస్తూ పరుగుల ధాటిని కట్టడి చేసింది. ఆసీస్ బ్యాటర్లకు చెమటలు పట్టించి 236 పరుగులకే పరిమితం చేశారు. భారత జట్టు ఈ లక్ష్యాన్ని ఇంకా ముందుగానే అధిగమించే అవకాశం ఉన్నా.. ఏ మాత్రం తొందరపడకుండా మ్యాచ్‌ను తామే ఫినిష్ చేయాలనేట్టుగా రో-కో ద్వయం పరుగుల వరద సృష్టించింది.
ఇక యువ బౌలర్ హర్షిత్ రాణా ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ అనంతరం 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా అత్యంత సునాయాసంగా ఛేదించింది. 9 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించినప్పటికీ సిరీస్‌ను మాత్రం కైవసం చేసుకోలేకపోయింది. మొదటి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్‌ను సొంతం చేసుకుంది.
కాగా, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 125 బంతుల్లో 121 పరుగులు చేసి తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. దీంతో తన వన్డే కెరీర్‌లో 33వ సెంచరీని దిగ్విజయంగా పూర్తి చేశాడు. 13 ఫోర్లు, 3 సిక్సర్లతో ఫ్యాన్స్‌ను అబ్బురపరిచాడు. ఇక కింగ్ కోహ్లీ కూడా రోహిత్‌కు అండగా నిలిచి.. 81 బంతుల్లో 74 పరుగులు(7 ఫోర్లు) చేశాడు.


