Indian Star Batsman Shreyas Iyer Health Update: భారత స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ అభిమానులకు గుడ్ న్యూస్. సిడ్నీ వన్డేలో క్యాచ్ అందుకునే క్రమంలో గాయపడిన శ్రేయస్ అయ్యర్ కోలుకుంటున్నాడు. రెండు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న అయ్యర్‌ను.. సోమవారం ఐసీయూ నుంచి స్పెషల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు. అయితే, అస్పత్రిలోనే మరో రెండు మూడు రోజులు ఉండాల్సి వస్తుందని తెలిపారు. అయ్యర్ పూర్తిగా కోలుకునేందుకు మూడు వారాలకు పైగా సమయం పట్టనుందని సమాచారం. శ్రేయాస్ అయ్యర్ మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ.. క్యాచ్ అందుకుంటున్న సమయంలో గాయాలపాలయ్యాడు. ఎడమవైపు పొత్తకడుపు కింది భాగంలో అతడి మోచేయి బలంగా తాకింది. దాంతో, నొప్పితో విలవిల్లాడిన అతడిని ఫిజియో పరీక్షించారు. అయినా అయ్యర్ ఇబ్బంది పడుతూనే ఉండడంతో ఆసల్యం చేయకుండా ఆస్పత్రిలో చేర్పించారు. స్కానింగ్ పరీక్షల్లో అతడికి ప్లీహం భాగంలో గాయం అయినట్టు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని వైద్యులు ధృవీకరించారు. కాగా, ప్రస్తుతం బీసీసీఐ వైద్యబృందం అయ్యర్ అరోగ్యాన్ని అనుక్షణం పర్యవేక్షిస్తోంది. అతడి ఆరోగ్యంలో రోజూవారీ పురోగతిని గమనించేందుకు టీమిండియా డాక్టర్ సిడ్నీలోనే ఉండనున్నాడని బీసీసీఐ ఒక ప్రకనటలో తెలిపింది. అంతేకాదు అయ్యర్‌కు అండగా కొందరు స్నేహితులు ఉన్నారని.. వీసా ప్రక్రియ పూర్తికాగానే అతడి కుటుంబసభ్యులు కూడా సిడ్నీ చేరుకుంటారని బీసీసీఐ తెలిపింది.
క్యాచ్ పట్టే క్రమంలో పక్కటెముకలో నొప్పి..
కాగా, ఆస్ట్రేలియతో జరిగిన మూడో వన్డేలో హర్షిత్ రానా ఓవర్లో అలెక్స్ క్యారీ థర్డ్‌మ్యాన్ దిశలో కొట్టిన బంతిని అయ్యర్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. సూపర్ క్యాచ్ పట్టిన అతడు.. ఆ తర్వాత ఎడమవైపు పక్కటెముల నొప్పితో విలవిల్లాడాడు. దాంతో, ఫీజియో వచ్చి పరీక్షించాడు.. అయినా ఉపశమనంగా లేకపోవడంతో అయ్యర్ బాధపడుతూనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. అతడికి స్కానింగ్ పరీక్షలు జరిపిన వైద్యలు.. పెద్ద ప్రమాదమేమీ లేదని తేల్చడంతో భారత మేనేజ్‌మెంట్, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. నవంబర్ ఆఖర్లో దక్షిణాఫ్రికాతో జరుగబోయే మూడు వన్డేల సిరీస్ లోపు అయ్యర్ కోలుకునే అవకాశముంది. స్వదేశంలో నవంబర్ 30, డిసెంబర్ 3, డిసెంబర్ 6వ తేదీన సఫారీ టీమ్‌తో టీమిండియా తలపడనుంది. అయితే, శ్రేయస్ అయ్యర్‌కు గాయాలేమీ కొత్త కాదు. గతంలోనూ పలుసార్లు గాయాలపాలై ఆటకు దూరమయ్యాడు. 2021లో భుజానికి గాయం చేసుకొని కొన్ని నెలల పాటు ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత వెన్నుగాయం బారిన పడ్డాడు. అనంతరం సర్జరీ చేయించుకున్నాడు. వరుస గాయాల కారణంగా అతడు టెస్టు ఫార్మాట్‌కు కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే భారత్‌కు ఆడుతున్నాడు. ఇక ఐపీఎల్ ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌కు టీమిండియా వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. అంతలోనే మూడో వన్డేలో గాయపడ్డాడు.


