ముంబై వాంఖడే వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదో టీ20లో.. టీమిండియా ఊర మాస్ ఊట రుచి చూపించింది. నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా 247 పరుగులు నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించింది. ఓపెనర్ అభిషేక్ 54 బంతుల్లో 135 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అభిషేక్ ఇన్నింగ్స్ లో 13 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. ఆ హిట్టింగ్ కు ఇంగ్లండ్ బౌలర్ల వద్ద సమాధానం లేకపోయింది.
టీమిండియా ఇన్నింగ్స్ లో ఏకంగా 20 సిక్సర్లు, 20 ఫోర్లతో బ్యాటర్లు రెచ్చిపోయారు. ఇందులో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ తో పాటు.. తిలక్ వర్మ 24, శివమ్ దుబే 30 పరుగులు చేశారు. ఒకానొక దశలో కేవలం 10 ఓవర్లకు 143 పరుగులు చేసిన భారత్ భారీ స్కోరు దిశగా ముందుకు సాగింది. కానీ వెంట వెంటనే వికెట్లు పడిపోవడంతో కాస్త స్కోర్ తగ్గింది. అయినప్పటికీ ఈ మ్యాచులో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో టీ20లలో భారత్ తమ నాలుగో అత్యధిక స్కోరును నమోదు చేసుకుంది. ఇదిలా ఉంటే ఈ మ్యాచులో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ భారత జట్టు తరఫున అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
అలాగే తన వ్యక్తిగతంగా టీ20లలో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఈ మ్యాచులో ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడన్ కార్సే మూడు వికెట్లు తీయగా.. మార్క్ వుడ్ 2, రషీద్ 1, ఆర్చర్ 1, వికెట్లు తీసుకున్నారు. కాగా ఈ మ్యాచులో భారత్ 20 ఓవర్లు ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఈ మ్యాచులో ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే 120 బంతుల్లో 248 పరుగులు చేయాల్సి ఉంది. మరీ ఈ మ్యాచులో ఇంగ్లాండ్ ఎలా ఆడుతుందో చూడాలి.