Mohammed Shami : భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయం కారణంగా బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌కు దూరం అయిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌కు వెళ్లే ముందు నిర్వహించిన ప్రాక్టీస్ సెషన్‌లో షమీ భుజానికి గాయమైంది. దీంతో అతడు జట్టుతో పాటు బంగ్లాదేశ్‌కు వెళ్లలేదు. అతడి స్థానంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) ఉమ్రాన్ మాలిక్‌ను ఎంపిక చేసింది. ప్రస్తుతం షమీ నేషనల్ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.
తన గాయంపై షమీ స్పందించాడు. తన కెరీర్‌లో గాయాలు భాగమైపోయాయని చెప్పాడు. గాయమైన ప్రతిసారి నేర్చుకుని మరింత బలంగా తిరిగివచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు. గాయాలు మనకు కొత్త పాఠాలు నేర్పిస్తాయని చెప్పుకొచ్చాడు. ఈ సారి కూడా మరింత బలంగా తిరిగి వస్తాను అంటూ సోషల్ మీడియాలో షమీ రాసుకొచ్చాడు.
షమీకి అయిన గాయం కాస్త తీవ్రమైనదిగానే తెలుస్తోంది. గాయం నుంచి కోలుకునేందుకు కనీసం మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో అతడు బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. షమీ బంగ్లాతో టెస్టు సిరీస్‌కు దూరం అయితే భారత్‌కు గట్టి ఎదరుదెబ్బగానే చెప్పవచ్చు. ఎందుకంటే వచ్చే ఏడాది ఓవల్‌లో జరగబోయే ఐసీసీ ప్రపంచకప్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో భారత్ ఉండాలంటే ఇప్పటి నుంచి ఆడే ప్రతి టెస్టు మ్యాచ్‌లో గెలవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే గాయం కారణంగా బుమ్రా మ్యాచ్‌లు ఆడడం లేదు. ఇప్పుడు షమీ కూడా దూరం అయితే మాత్రం చాలా కష్టం.