ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభ వేడుకలు అదిరిపోయాయి. 18వ సీజన్‌కి ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. ఇక ఈ ఆరంభ వేడుకలను బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ప్రారంభించగా.. ప్రఖ్యాత సింగర్ శ్రేయా ఘోషల్ తన మధురమైన పాటలతో అలరించారు. ఆమి ఝే తోమర్ పాటతో మొదలు పెట్టిన శ్రేయా.. మా తుఝే సలాం సాంగ్‌తో తన ప్రదర్శన చేశారు.
అనంతరం దిశా పటానీ తన డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. పలు హిందీ సాంగ్స్‌కు దిశా పటానీ చిందేసింది. ఆ తర్వాత ప్రముఖ ర్యాపర్ కరణ్ ఆజ్లా తన గాత్రంతో అభిమానులను అలరించాడు. అనంతరం షారూఖ్ ఖాన్ ఈ వేడుకలకు హోస్ట్‌గా వ్యవహరించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీని స్టేజీపైకి ఆహ్వానించాడు. 18 సీజన్లుగా ఆడుతూ అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాడిగా అతనిపై ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లీతో సరదాగా మాట్లాడిన షారూఖ్ ఖాన్.. అనంతరం KKR సెన్సేషన్ రింకూ సింగ్‌ను కూడా స్టేజీపైకి ఆహ్వానించాడు.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి గోల్డెన్ జనరేషన్ ఆటగాళ్లకు కుర్రాళ్లు పోటీ ఇస్తారా.. అని రింకూ సింగ్‌ను ప్రశ్నించగా.. తాను కూడా ఆ జనరేషన్ ఆటగాడినేని, వాళ్లు ఓల్డ్ జనరేషన్ కాదని బదులిచ్చాడు. అనంతరం రింకూ సింగ్‌తో కలిసి షారూఖ్ ఖాన్ డ్యాన్స్ చేయగా.. విరాట్ కోహ్లీ పడి పడి నవ్వుకున్నాడు. ఆ తర్వాత కోహ్లీ కూడా షారూఖ్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. అనంతరం బీసీసీఐ పెద్దలతో పాటు ఆరంభ వేడుకల్లో పాల్గొన్న సెలెబ్రిటీలను స్టేజీపైకి షారుఖ్ ఖాన్ ఆహ్వానించగా.. కేకేఆర్, ఆర్‌సీబీ కెప్టెన్లు అజింక్యా రహానే, రజత్ పటీదార్‌లు ట్రోఫీని స్టేజిపైకి తీసుకొచ్చారు. బీసీసీఐ పెద్దలంతా కలిసి భారీ కేకును కట్ చేసి ఐపీఎల్ 2025 సీజన్‌ను ప్రారంభించారు. జాతీయ గీతంతో ఆరంభ వేడుకలను ముగించారు.