ఐపీఎల్ 2025 సీజన్ భారతదేశం నలుమూలల అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఇదిలా ఉంటే ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, బీసీసీఐ ఐపీఎల్ మ్యాచ్‌ల కోసం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. స్టేడియంల వద్ద గగనతల భద్రతను సమర్థవంతంగా పరిరక్షించేందుకు వజ్ర సూపర్ షాట్ అనే ఆధునిక యాంటీ-డ్రోన్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు.
వజ్ర సూపర్ షాట్ ఏమిటంటే, చెన్నైకి చెందిన బిగ్ బ్యాంగ్ బూమ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఓ సరికొత్త యాంటీ-డ్రోన్ వ్యవస్థ ఇది.
స్టేడియం చుట్టూ నాలుగు కిలోమీటర్ల పరిధిలోకి అనధికారికంగా ప్రవేశించే డ్రోన్‌లను గుర్తించి, వాటి కమ్యూనికేషన్ వ్యవస్థను నిలిపివేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తోంది. తేలికైన రూపకల్పనతో తయారు చేసిన ఈ పరికరం, సులభంగా స్థలం మార్చగలిగే విధంగా ఉండటంతో, పెద్ద ఈవెంట్లలో మౌలిక సదుపాయాల పరంగా ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ సాంకేతికతను తొలిసారిగా కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో, కోల్‌కతా నైట్ రైడర్స్.. పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. అప్పటి నుంచి దాని విజయవంతమైన ఫలితాలను చూసి, అన్ని ప్రధాన స్టేడియంలలో ఈ పరికరాన్ని అమలు చేయాలని నిర్ణయించారు.
పహల్‌గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయక యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన దేశవ్యాప్తంగా భద్రతా వ్యూహాలను మళ్లీ పునఃపరిశీలించుకునేలా చేసింది. ఐపీఎల్ వంటి భారీ సమీకరణల సందర్భంగా అభిమానులు, ఆటగాళ్ల రక్షణకు సంబంధించి ఏర్పాట్లు పటిష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వజ్ర సూపర్ షాట్ టెక్నాలజీని రంగంలోకి దింపడం భద్రతపై తీసుకున్న ముందస్తు జాగ్రత్తలలో భాగం. ఇప్పుడు స్టేడియంలకు వచ్చే ప్రేక్షకులు ఎటువంటి భయాందోళనలేకుండా తమ ప్రియమైన ఆటను ఆస్వాదించగలుగుతున్నారని, భద్రతా బృందాలు అంటున్నాయి. భవిష్యత్తులో మరింత ఆధునిక భద్రతా టెక్నాలజీలు కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.